నాగాలాండ్ గవర్నర్ గణేశన్ (80) కన్నుమూశారు. ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6.23 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇటీవల అకస్మాత్తుగా కిందపడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. 1945 ఫిబ్రవరి 16న తంజావూరులో జన్మించిన గణేశన్, చిన్నతనం నుంచే ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుగ్గా ఉన్నారు. 1991లో బీజేపీలో చేరి, తమిళనాడులో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు.
2006 నుంచి 2009 వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2016లో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి, 2023 వరకు కొనసాగారు. అదే ఏడాది నాగాలాండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2022లో పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
గణేశన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “గణేశన్ జీ మరణం బాధాకరం. ఆయన దేశభక్తుడిగా, దేశసేవకు, జాతి నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా చిరకాలం గుర్తుంటారు” అని పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గణేశన్‌ను గొప్ప రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు.