NTR Health Services : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే ఎన్టీఆర్ వైద్య సేవలకు మరోసారి సంక్షోభం తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా అనేక ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్య సేవలు(Free medical services) అందిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం అనుబంధ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో, నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలను నిలిపివేయాలని తుది నిర్ణయానికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు సుమారు ₹2,700 కోట్లు. ఈ భారీ మొత్తాన్ని గత కొన్ని నెలలుగా ఆసుపత్రులు ఎదురు చూస్తున్నా, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో, వారు తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులకు గురవుతున్నారు. ఇంతకాలం అప్పుల మీద ఆసుపత్రులు నడుపుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి చేతులు ఎత్తేయాల్సిన స్థితికి వచ్చింది అని ఆషా ప్రతినిధులు( Asha representatives) వాపోయారు.
గత కొన్ని వారాలుగా పలుమార్లు ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినప్పటికీ, సమస్యకు పరిష్కారం దొరకలేదు. సెప్టెంబర్ 25న సమావేశమైన ఆషా రాష్ట్ర కార్యవర్గం, ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 10 నుంచి సేవలను నిలిపివేయాలని తీర్మానించింది. దీనికి అనుగుణంగానే నేటి (అక్టోబర్ 10) నుండి నెట్‌వర్క్ ఆసుపత్రులు ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఇక మాకు ఉపాయం లేదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గరిష్ఠంగా సహనం చూపించాం. కానీ ఇకపై సేవలను కొనసాగించగల పరిస్థితి లేదు అని ఆసుపత్రులు తమ ప్రకటనలో పేర్కొన్నాయి. సేవలను నిలిపివేయడం వల్ల సామాన్యులకు ఇబ్బంది తలెత్తుతుందన్న ఆవేదనను వ్యక్తం చేస్తూనే, ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. నెట్‌వర్క్ ఆసుపత్రుల అనుభవాలు విని చలించిపోయేలా ఉన్నాయి. ఇంతకాలం పంటి బిగువుతో ఆసుపత్రులను నడుపుతూ ముందుకెళ్లాం. కానీ ప్రస్తుతం ఎలాంటి సహాయమూ లేకపోవడంతో, వైద్య సేవలు నిలిపివేయడం తప్పు మార్గం లేదన్న అభిప్రాయానికి వచ్చాం అని ఆషా సభ్యులు పేర్కొన్నారు.
ఇక ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆసెంబ్లీలో బకాయిల విషయాన్ని మంత్రి స్వయంగా ప్రకటించినా, యధావిధిగా ప్రభుత్వం చేతులు చాచి నిలబడింది. మాటలు వినిపించాయి, కానీ చర్యలు కనిపించలేదు అని ఆషా నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రజల ఆరోగ్యం సమస్యగా మారకముందే తక్షణం స్పందించి పరిష్కారాన్ని కనుగొనాలని నిపుణులు, వైద్య రంగ ప్రతినిధులు హితవు పలుకుతున్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది పేదలు అత్యవసర వైద్యం లభించక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది.