బంగారం లాంటి అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న ప్రియాంక అరుళ్ మోహన్, పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘ఓజీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు ‘కన్మణి’. తమిళంలో ‘కన్మణి’ అంటే బంగారం అని అర్థం. పేరుకు తగ్గట్టే ఆమె ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు ప్రశాంతతను అందించే బంగారం లాంటి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, పాటలు అన్నీ పవన్ కళ్యాణ్ పాత్రలోని యాక్షన్, విధ్వంసాన్ని చూపించాయి. కానీ, తాజాగా విడుదలైన ప్రియాంక ఫస్ట్‌లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక పోస్టర్‌లో ఆమె దయ, బలాన్ని సూచిస్తుంటే, మరొకటి ప్రశాంతతను ప్రతిబింబిస్తోంది. అందుకే, ఆమె పాత్రను ‘ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత’గా చిత్ర బృందం అభివర్ణించింది. ఈ భారీ యాక్షన్ చిత్రంలో ప్రియాంక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ సూచిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.