జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం(Pahalgam)లో పర్యాటకులపై ఉగ్రమూకల(Terrorists attack) దాడి తర్వాత భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏప్రిల్ 29లోపు భారత్‌లో ఉంటున్న పాకిస్థానీయులందరూ(Pakisthan civilians) తమ దేశానికి వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. వాఘా సరిహద్దు(Vagha border)ను 30వ తేదీన మూసివేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు అలా మన దేశం నుంచి 786 మంది పాకిస్థానీయులు వారి దేశానికి వెళ్లారు. అలాగే అక్కడ ఉంటున్న 1,465 మంది భారతీయులు తమ స్వస్థలాలకు వచ్చారు.
రాకపోకల నేపథ్యంలో ఇండో- పాక్ వాఘా సరిహద్దు వద్ద హడావుడి నెలకొన్నది. ఎంతోమంది పాకిస్థానీయులు సాంకేతిక, రవాణా సంబంధిత సమస్యలతో భారత్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. వారందరికి ఉపశమనం కలిగించేలా తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. వాఘా సరిహద్దు వద్ద ఉన్నవారు, నిర్ణీత గడువు దాటినప్పటికీ.. వాఘా సరిహద్దు నుంచి తమ దేశానికి వెళ్లవచ్చని ప్రకటించింది. ఈ ప్రకటన పాకిస్థాన్ సరిహద్దు వద్ద చిక్కుకున్న వారికి ఉపశమనం కలిగించింది.
మరోవైపు జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారతీయులను వివాహం చేసుకున్న మహిళ లేదా పురుషుడు భారత్‌లోనే ఉండేందుకు అవకాశం కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎంతో మంది పాకిస్థానీయులు ఇక్కడి వారిని వివాహం చేసుకుని మూడు, నాలుగు దశాబ్దాల నుంచి భారత్‌లోనే ఉంటున్నారని.. ఉన్నపళంగా వారిని పాకిస్థాన్ వెళ్లపోమంటే వారి కుటుంబాలు ఛిద్రమవుతాయని పేర్కొన్నారు.