Ande Sri: తెలంగాణకు తన పద్యాలతో ప్రాణం పోసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. గత రాత్రి ఆయన హైదరాబాద్లోని నివాసంలో అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మరణవార్తతో తెలుగు సాహితీ ప్రపంచం దుఃఖసాగరంలో మునిగిపోయింది. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన ఆయన జీవితం కష్టాల పయనమే. చిన్ననాటి నుంచే గొర్రెల కాపరిగా జీవనాన్ని ప్రారంభించారు. తరువాత భవన నిర్మాణ కార్మికుడిగా కష్టపడ్డారు. పాఠశాల చదువుల్లేకపోయినా, ఆయనలోని సహజ ప్రతిభ, భాషపై మక్కువ ఆయనను కవిగా, రచయితగా తీర్చిదిద్దాయి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అందెశ్రీ వాణి అణగారిన ప్రజల మనసుల్లో జ్వాలగా మారింది. ఆయన రచించిన “జయ జయహే తెలంగాణ” గీతం తెలంగాణ ఆత్మగీతంగా నిలిచింది. ఈ గీతాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతంగా అధికారికంగా గుర్తించింది. అలాగే ఆయన రాసిన “మాయమైపోతున్నడమ్మా” పాట తెలంగాణ భావోద్వేగానికి ప్రతీకగా నిలిచింది. అందెశ్రీ సాహితీ సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు వరించాయి. 2006లో “గంగ” చిత్రానికి నంది పురస్కారం అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ నుంచి డాక్టరేట్ పొందారు. అలాగే 2015లో దాశరథి సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్నారు. ఇటీవల 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం ఆయనకు లభించాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆయనకు రూ. కోటి పురస్కారం కూడా ప్రకటించింది.
అందెశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “జయ జయహే తెలంగాణ” రచయిత అందెశ్రీ మరణం రాష్ట్ర సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రచన కోట్లాది ప్రజలకు ప్రేరణనిచ్చిందని, ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత రాష్ట్ర గీతానికి కొత్త స్వరరూపం ఇచ్చినప్పుడు అందెశ్రీ సూచనలు కీలకంగా నిలిచాయని చెప్పారు. అందెశ్రీ మరణంతో తెలంగాణ సాహితీ ప్రపంచం తన గొప్ప స్వరాన్ని కోల్పోయింది. భూమి నుంచి ఆకాశం వరకు ప్రతిధ్వనించే ఆయన పద్యాలు మాత్రం ఎప్పటికీ తెలంగాణ ఆత్మలో జీవిస్తూనే ఉంటాయి.
