Telangana : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల (Local body elections)నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వేగాన్ని పెంచింది. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికల కార్యక్రమాల రూపకల్పనలో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల పోస్టులకు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చివరి దశలోకి చేరుకుంది. ఈ మొత్తం కసరత్తులో బీసీ రిజర్వేషన్ల శాతం(Percentage of BC reservations)లో భారీ కోతను అమలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా కీలక చర్చాంశంగా మారింది. శుక్రవారం నాటికి జిల్లాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ కేటాయింపులు పూర్తి అయ్యాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లు నిర్ణయించగా, 2024లో నిర్వహించిన కులగణన సర్వేను ఆధారంగా తీసుకుని బీసీ వర్గాలకు స్థానాలు కేటాయించారు. రొటేషన్ విధానాన్ని అనుసరించి 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ మ్యాప్‌ను పరిశీలించి తాజా మార్పులు చేశారు.
ఈసారి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో సునామీలా మారింది. ఇంతకుముందు 42 శాతం గా ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లను ఇప్పుడు 22.3 శాతానికి పరిమితం చేశారు. అంటే, దాదాపు 19.7 శాతం స్థానాలు తగ్గి వాటిని జనరల్ వర్గానికి మళ్లించారు. దీంతో అనేక జిల్లాల్లో బీసీ అభ్యర్థులకు లభించే అవకాశాలు గణనీయంగా తగ్గినట్లు స్థానిక నాయకులు భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్లను కూడా ఇదే సమయంలో ఖరారు చేసి, జిల్లా స్థాయి జాబితాలను పంచాయతీరాజ్ శాఖకు పంపే ప్రక్రియ కొనసాగుతోంది. రిజర్వేషన్ల ఖరారును పూర్తి చేసినప్పటికీ, తుది జాబితాను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడం లేదు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పెండింగ్‌లో ఉన్న కేసులపై హైకోర్టు ఈ నెల 24న తీర్పు ఇవ్వనుంది.
ఆ తీర్పు వెలువడిన మరుసటి రోజున జరిగే మంత్రిమండలి సమావేశంలో ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల తుది జాబితాపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. కేబినెట్ ఆమోదం వచ్చిన వెంటనే అధికారిక జాబితాను ప్రకటించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు హైకోర్టు తీర్పు, అనంతరం కేబినెట్ నిర్ణయాన్ని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాజకీయంగా కూడా ఈ నిర్ణయాలు కీలక ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అంతేకాక, ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారంలోనే విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల వేడి మొదలైందని చెప్పాలి.
