AP Transport Department: సంక్రాంతి పండుగ(Sankranti festival) సందర్భంగా ప్రయాణికుల (Passengers)రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ ధరలను(Ticket prices) అడ్డగోలుగా పెంచితే సహించబోమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ రవాణా శాఖ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా హెచ్చరించారు. పండుగ వేళ ప్రయాణికులపై భారం మోపే ప్రయత్నాలకు తావులేదని ఆయన తేల్చి చెప్పారు. టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిందని కమిషనర్ తెలిపారు. ఆర్టీసీ ఛార్జీలతో పోలిస్తే గరిష్ఠంగా 50 శాతం వరకు మాత్రమే ప్రైవేట్ బస్సులు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ పరిమితిని మించి ఛార్జీలు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల హక్కులను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. టికెట్ ధరల పెంపు అంశంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని రవాణా శాఖ వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రోజువారీ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. రవాణా అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేస్తూ, టికెట్ ధరలు, బిల్లులు, బుకింగ్ వివరాలను పరిశీలిస్తున్నారని వివరించారు. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అభి బస్, రెడ్ బస్ వంటి ఆన్‌లైన్ బుకింగ్ యాప్‌ల ద్వారానూ ప్రైవేట్ బస్సులు వసూలు చేస్తున్న టికెట్ ధరలను పర్యవేక్షిస్తున్నామని కమిషనర్ తెలిపారు.
యాప్‌లలో అధిక ధరలు నమోదు అయితే సంబంధిత ట్రావెల్స్ యాజమాన్యాలపై కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ బుకింగ్‌ల ద్వారా జరుగుతున్న దోపిడీని అరికట్టడమే లక్ష్యమని అన్నారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 9281607001ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధిక టికెట్ ధరలు వసూలు చేసినట్లు గుర్తిస్తే ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ప్రయాణికులను కోరారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రతి ప్రైవేట్ బస్సులో స్పష్టంగా ప్రదర్శించేలా ట్రావెల్స్ యజమానులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ప్రయాణికుల సహకారంతోనే అక్రమాలకు చెక్ పెట్టగలమని రవాణా శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
