Telangana Panchayat Elections : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నవంబర్ 22న విడుదల చేసిన జీవో నెం.46 చుట్టూ రాజకీయ, న్యాయ చర్చలు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం(Reservations 50 percent) మించినలా ఉండకూడదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొన్న ఆ జీవోపై పలు సంఘాలు (Associations) అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొందరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్లపై ఈరోజు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ నిర్వహించింది. జీవో 46ను నిలిపివేయాలని కోరిన పిటిషనర్ల వాదనలను విన్న ధర్మాసనం ఈ దశలో స్టే ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన అనంతరం ఆదేశాలపై స్టే ఇవ్వడం ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. పిటిషనర్లు తమ వాదనలో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీ వర్గాల ప్రకారం విభజించి కేటాయించాలని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వం జారీ చేసిన ప్రస్తుత రిజర్వేషన్ విధానం వెనుకబడిన వర్గాలకి అన్యాయం చేస్తున్నట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుండగా మధ్యలో జోక్యం చేసుకోవడం తగదని ధర్మాసనం అభిప్రాయపడింది. రికార్డుల పరిశీలన అనంతరం అవసరమైతే తదుపరి దశలో వివరమైన విచారణ చేపడతామని స్పష్టం చేసింది. పిటిషనర్ల వాదనలను నమోదు చేసుకున్నా, తక్షణ స్టే అవసరం లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. అదేవిధంగా, పంచాయతీ రాజ్ ఎన్నికలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా మార్పు చేయడానికి ఇది సరైన సమయం కాదని న్యాయస్థానం అభిప్రాయపడ్డది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సాఫీగా సాగేందుకు న్యాయస్థానం జోక్యం పరిమితంగానే ఉండాలని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.46 ప్రస్తుతం అమల్లోనే కొనసాగనుంది. రిజర్వేషన్ల విధానం పై పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలు విచారణలో భాగంగా ఉన్నా, ఎన్నికలు జరుగుతున్న సమయంలో వాటిపై స్టే విధించే పరిస్థితి లేదని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై నడుస్తున్న ఈ న్యాయపరమైన పోరాటం ఇంకా కొనసాగనుండగా, హైకోర్టు తాజా వ్యాఖ్యలు ప్రభుత్వ నిర్ణయాలకు తాత్కాలిక ఉపశమనం కలిగించినట్టైంది.
