Amaravati : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC)లో అద్దె బస్సుల (Hire buses)యజమానులు ఈ నెల 12వ తేదీ నుంచి సమ్మె(strike)కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. తమ సమస్యలను ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఇవాళ అధికారికంగా నోటీసులు ఇవ్వనున్నారు. ఇప్పటికే నెలలుగా కొనసాగుతున్న ఆర్థిక భారంతో పాటు కొత్త విధానాల కారణంగా నష్టాలు పెరుగుతున్నాయని యజమానులు వాపోతున్నారు. ప్రధానంగా ‘స్త్రీశక్తి’ ఉచిత ప్రయాణ పథకం అమలుతో బస్సుల్లో రద్దీ భారీగా పెరిగిందని అద్దె బస్సుల యజమానులు చెబుతున్నారు. రద్దీ కారణంగా బస్సుల నిర్వహణ ఖర్చులు, ఇంధన వినియోగం, మరమ్మతుల వ్యయం గణనీయంగా పెరిగిందని వారు పేర్కొంటున్నారు.
అయితే ఈ అదనపు భారం తమపై పడుతున్నప్పటికీ, అందుకు తగిన పరిహారం అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అద్దె బస్సుల యజమానుల డిమాండ్లపై స్పందించిన ఆర్టీసీ, ఒక్కో బస్సుకు అదనంగా నెలకు రూ.5,200 చెల్లించాలని నిన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇది సరిపోదని యజమానులు స్పష్టం చేస్తున్నారు. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కనీసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనపు చెల్లింపులు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత మొత్తంతో నిర్వహణ సాధ్యం కాదని, ఇలాగే కొనసాగితే నష్టాల నుంచి బయటపడటం అసాధ్యమని యజమానులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దాదాపు 2,500 అద్దె బస్సులు ఆర్టీసీ సేవల్లో ఉన్నాయి. ఇవి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, దూరప్రాంతాలకు ప్రయాణికులను చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అలాంటి బస్సులు సమ్మె కారణంగా రోడ్లపైకి రాకపోతే, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ సమ్మె అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుంది. అద్దె బస్సులు నిలిచిపోతే టికెట్ల కొరత, రద్దీ, ఆలస్యాలు వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే స్పందించి అద్దె బస్సుల యజమానులతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రయాణికులు కోరుతున్నారు
