Amaravati : రాజ్యాంగ దినోత్సవాన్ని (Constitution Day) పురస్కరించుకుని అమరావతిలోని అసెంబ్లీ (Assembly) ప్రాంగణం విద్యార్థుల సందడితో కిక్కిరిసిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులు పాల్గొని నిజమైన శాసనసభ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక మాక్ అసెంబ్లీ సమావేశాన్ని(Special Mock Assembly Meeting)నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. యువతలో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అవగాహన పెంపొందించడానికి, శాసనసభ పనితీరును ప్రత్యక్ష అనుభవంతో అర్థం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పాత్రను మన్యం జిల్లాకు చెందిన ఎం. లీలా గౌతమ్ పోషించారు. ప్రతిపక్ష నాయకురాలిగా అదే జిల్లాకు చెందిన సౌమ్య వ్యవహరించగా, డిప్యూటీ సీఎంగా విశాఖ జిల్లాకు చెందిన కోడి యోగి బాధ్యతలు చేపట్టారు. విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్‌గా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి కార్యక్రమాన్ని సజావుగా నడిపించారు.
విద్యార్థుల ప్రదర్శనలో నాయకత్వ నైపుణ్యాలు, స్పష్టమైన ప్రసంగ శైలి, సమస్యలపై అవగాహన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సామాజిక మాధ్యమాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రస్తుత సమాజానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాలపై మాక్ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలు జరిగాయి. సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న అసత్య సమాచారంపై నియంత్రణ చర్యలు తీసుకోవాలనే అంశంపై విద్యార్థులు ఉత్సాహంగా చర్చించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. వాతావరణ మార్పులు, కాలుష్యం, చెట్ల నరికివేత వంటి సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రతిపాదిస్తూ విద్యార్థులు తమ సమాజంపై బాధ్యతను వ్యక్తపరిచారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల పాఠశాలలకు ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. దాంతో లక్షలాది మంది విద్యార్థులు మాక్ అసెంబ్లీని వీక్షించి, శాసన ప్రక్రియ ఎలా సాగుతుందో ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు. విద్యార్థులు శాసనసభలో చర్చలు ఎలా జరుగుతాయో, బిల్లులు ఎలా ప్రవేశపెడతారు, ఎలా ఆమోదం పొందుతాయో ప్రత్యక్షంగా అర్ధం చేసుకున్నారు. మొత్తంగా, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ మాక్ అసెంబ్లీ విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలకు మరింత దగ్గరగా తీసుకెళ్లింది. పాలన వ్యవస్థ ఎలా పనిచేస్తుందో యువతలో అవగాహన పెంచడంలో ఇది ఒక మంచి ప్రయత్నంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించాలని విద్యార్థులు కోరుకున్నారు.
