Telangana Panchayat Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ (Notification) అధికారికంగా విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (State Election Commissioner Rani Kumudini)సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఎన్నికల ప్రక్రియ, షెడ్యూల్ మరియు అమలు విధానాలపై విపులంగా వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈసారి గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీలను పోలింగ్ రోజులకు కేటాయించారు. ప్రతీ విడతలోనూ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతూ, మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.
సెప్టెంబర్ 29న తొలి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న ఆ షెడ్యూల్‌పై కోర్టు స్టే విధించిందని ఆమె గుర్తుచేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి విడతలో 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్ పోస్టులు, 38,350 వార్డులు, మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాణి కుముదిని వివరించారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 1.66 కోట్ల గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆమె తెలిపింది. అలాగే, ప్రతి విడతకు నామినేషన్ దాఖలు తేదీలను కూడా ప్రకటించారు. మొదటి విడతకు నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. రెండో విడతకు నవంబర్ 30 నుంచి, మూడో విడతకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆమె తెలిపారు.
నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తేదీలు కూడా సంబంధిత నియోజకవర్గాలకు ప్రత్యేకంగా తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మొత్తం ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా స్థాయి అధికారులతో సమన్వయం కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు. భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సిబ్బంది నియామకం వంటి అంశాలకు ఇప్పటికే దిశానిర్దేశాలు అందించినట్లు తెలిపారు. గ్రామీణ అభివృద్ధిలో పంచాయతీ ఎన్నికలు కీలకమని, ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలని రాణి కుముదిని పిలుపునిచ్చారు.
