end
=
Friday, December 12, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌.. ఫ్యూచర్‌సిటీకి చేరుకుంటున్న వివిధ దేశాల ప్రతినిధులు
- Advertisment -

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌.. ఫ్యూచర్‌సిటీకి చేరుకుంటున్న వివిధ దేశాల ప్రతినిధులు

- Advertisment -
- Advertisment -

Telangana : తెలంగాణ ప్రతిష్ఠను అంతర్జాతీయ వేదికపై స్థిరపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆరంభిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’(Telangana Rising Global Summit) ఇంకాసేపట్లో ఘనంగా ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్‌ వర్మ(Governor Jishnu Dev Verma) ఈప్రపంచ స్థాయి సమ్మిట్‌కు అధికారికంగా ప్రారంభసూచన ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు పరిధిలో ఉన్న ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో 100 ఎకరాల విస్తీర్ణంలో రెండు రోజులపాటు (సోమ, మంగళవారాల్లో) జరుగనున్న ఈ సమ్మిట్‌కు 44 దేశాలకు చెందిన 154 మంది విదేశీ ప్రతినిధులు ఇప్పటికే హాజరయ్యారు. ప్రారంభ వేడుకకు హాజరయ్యే సుమారు 2,000 మంది దేశీయ–అంతర్జాతీయ అతిథుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. ఆయన తెలంగాణలో ప్రజాపాలన సవ్యంగా అమలు అవుతున్న తీరు, పెట్టుబడులకు విస్తృత అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహాలు, విజన్–2047 లక్ష్యాలు, అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ రూపకల్పనపై వివరణాత్మకంగా తెలియజేయనున్నారు. సమ్మిట్ కోసం దేశ విదేశాల నుండి వచ్చిన ప్రముఖులు ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి చేరుకుంటున్నారు. వీవీఐపీల భద్రత కోసం హోటళ్ల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సమగ్ర పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ప్రత్యేక లైజనింగ్ అధికారులను నియమించారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలకు డీఎస్పీ స్థాయి అధికారులతో భద్రత కల్పించగా, వీవీఐపీలు మరియు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక యాక్సెస్ పాస్‌లు జారీ చేశారు. ప్రధాన సమావేశ హాలులో 2,000 మందికి ఆసనాలు ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతికతతో వేదికను అభివృద్ధి చేశారు. సమ్మిట్ సమయంలో వివిధ రంగాల సంస్థలు, శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి పెట్టుబడుల ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు సినీ, క్రీడా, విద్యా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరుకానుండటం విశేషం.

ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు, రాష్ట్ర అభివృద్ధి దిశగా కొత్త అధ్యాయం రాసేందుకు ఈ సమ్మిట్ వేదిక కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సమ్మిట్ యొక్క కార్యాచరణలో 27 ప్రత్యేక ప్యానెల్ సెషన్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సెషన్లలో శక్తి, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, పట్టణ మౌలిక సదుపాయాలు, వ్యవసాయం వంటి కీలక రంగాలపై లోతైన చర్చలు జరుగుతాయి. సెమీకండక్టర్ తయారీ, ఫ్రంటియర్ టెక్నాలజీలు, గ్రీన్ మొబిలిటీ, క్లీన్ ఎనర్జీ, జీరో-ఎమిషన్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా తెలంగాణను గ్లోబల్ టెక్ మరియు ఎకో-ఫ్రెండ్లీ హబ్‌గా మార్చాలని ఆశిస్తున్నారు. వ్యవసాయ రంగంలోనూ IoT మైక్రో-ఇరిగేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు మరియు ఫార్మర్-ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను ఫుడ్ డెలివరీ కంపెనీలతో అనుసంధానించడంపై చర్చలు జరుగుతాయి. అలాగే, హైదరాబాద్ జెనోమ్ వ్యాలీ ద్వారా వ్యాక్సిన్ తయారీ హబ్‌గా తెలంగాణను స్థాపించడంపై హెల్త్‌కేర్ సెషన్లలో చర్చిస్తారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -