Islamabad : పాకిస్థాన్–అఫ్గానిస్థాన్ (Pakistan–Afghanistan) సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. రెండు దేశాల సైనిక బలగాల మధ్య చోటుచేసుకున్న కాల్పుల వల్ల సరిహద్దు ప్రాంతాలు మరోసారి ఉద్రిక్తతల కేంద్రంగా మారాయి. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే అఫ్గానిస్థాన్ సైన్యం దాడులు(Army attacks) జరిపిందని పాకిస్థాన్ అధికారులు తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ భద్రతాధికారుల ప్రకారం, ఖైరాబాద్ సమీపంలో ఉన్న వారి పోస్ట్‌లపై అఫ్గాన్ సైన్యం కాల్పులకు దిగింది. దీనికి తమ బలగాలు తీవ్ర ప్రతిస్పందనగా ఎదురుదాడులు జరిపినట్లు చెప్పారు. ఈ ఎదురుదాడుల్లో అఫ్గాన్ సైనికుల ట్యాంకులు, కొన్ని ఆర్మీ పోస్ట్‌లను పాక్షికంగా ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.
అఫ్గాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్ డిప్యూటీ పోలీస్ ప్రతినిధి తాహిర్ అహ్రర్ ఈ సంఘటనలను ధ్రువీకరించారు. రెండు వైపులా తీవ్ర కాల్పులు జరిగినట్టు ఆయన తెలిపారు. అయితే, ఏ దేశం ముందు దాడి ప్రారంభించిందన్న అంశంపై స్పష్టత రాలేదు. పాకిస్థాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, అఫ్గాన్ దళాలు తాలిబన్ మద్దతుతో కూడిన తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) శక్తులతో కలిసి సమన్వయంగా దాడులకు పాల్పడ్డాయి. వారి కలహానికి తమ భూభాగంలో ఉన్న సైనిక స్థావరాలే లక్ష్యంగా మారాయని తెలిపారు. పాక్ బలగాలు వెంటనే బలమైన ప్రతిస్పందన ఇస్తూ టీటీపీకి చెందిన ఓ భారీ శిక్షణా కేంద్రాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్‌లోని ప్రముఖ రాజకీయ పార్టీ ‘జమీత్ ఉలేమా-ఇ-ఇస్లాం (ఫజల్)’ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ స్పందించారు. ఇరుదేశాల మధ్య తీవ్రత తగ్గించేందుకు తాను మధ్యవర్తిత్వానికి సిద్ధమని చెప్పారు. గతంలో కూడా ఇలాంటి ఘర్షణల్లో తన పాత్ర కీలకమైందని గుర్తు చేశారు. ఇప్పుడు మరోసారి అఫ్గాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య పరస్పర నమ్మకం పెంచుకునే దిశగా ముందడుగు వేయాలి. శాంతియుత పరిష్కారం కోసమే నా ప్రయత్నం అని ఫజ్లుర్ రెహమాన్ పేర్కొన్నారు. ప్రజల శాంతి భద్రతకు ఇది అత్యంత కీలకమని, రెండు ప్రభుత్వాలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సరిహద్దు పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పలు గ్రామాల ప్రజలు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకముందు పరిస్థితి ఎలా మలుపుతీసుకుంటుందన్న దానిపై స్పష్టత లేదు. మళ్లీ రెండు దేశాల మధ్య చర్చల ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నది అంతర్జాతీయ సమాజం అభిప్రాయం.