Ethiopian volcano : చలికాలం తీవ్రత, పెరుగుతున్న వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ఉత్తర భారతానికి మరో కొత్త ప్రమాదం ముందుకు వచ్చింది. ఇథియోపియా(Ethiopia)లో విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతం(Volcano) నుంచి వచ్చిన భారీ బూడిద మేఘం (Ash Cloud) భారత దిశగా (Towards India)వేగంగా కదులుతోంది. ఈ మేఘం దేశంలోని అనేక రాష్ట్రాల వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసి, ప్రజలకు జాగ్రత్త సూచనలు అందిస్తున్నారు.
బూడిద మేఘం అంటే ఏమిటి? దానిలో దాగి ఉన్న ప్రమాదం ఏంటి?
అగ్నిపర్వతం విస్ఫోటనం చెందే సమయంలో దాని లోపలి నుంచి వెలువడే పదార్థాలు నేరుగా వాతావరణంలోకి చేరతాయి. అవే చేరి క్రమంగా ఒక భారీ బూడిద మేఘంగా మారతాయి. ఈ మేఘంలో అగ్నిపర్వత భస్మం, సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు, చిన్న రాళ్లు, గాజు రేకలు వంటి సూక్ష్మకణాలు ఉంటాయి. ఇవి గాలిలో విస్తరించినప్పుడు వాతావరణపు స్వచ్ఛతను దెబ్బతీసి, మానవ ఆరోగ్యానికి, విమాన రవాణాకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇథియోపియాలోని హేలీ గుబ్బి (Hale Gubbi) అగ్నిపర్వతం ఇటీవల సంభవించిన శక్తివంతమైన విస్ఫోటనం కారణంగా వేల మీటర్ల ఎత్తులో బూడిద మేఘం వ్యాపించింది. నిపుణుల అంచనా ప్రకారం ఈ మేఘం 15,000 నుంచి 25,000 అడుగుల ఎత్తు వరకూ చేరింది. కొన్ని సందర్భాల్లో ఇది 45,000 అడుగుల వరకు ఎగసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బూడిద మేఘం ఎర్ర సముద్రం మీదుగా అరేబియా సమీపానికి చేరుకుంది. అక్కడి నుంచి భారత ఉపఖండం వైపు దిశ మార్చుకుని ప్రయాణిస్తోందని వాతావరణ నిపుణులు తెలియజేశారు.
విమాన సర్వీసులపై ఎఫెక్ట్..ఆరోగ్య సమస్యలిలా..
ఈ మేఘం ప్రభావం ముఖ్యంగా గుజరాత్, ఢిల్లీ ఎన్‌సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, హిమాలయ ప్రాంతాలు వంటి రాష్ట్రాలపై పడే అవకాశం ఉంది. గాలిలో సూక్ష్మ కణాల సమృద్ధి పెరగడంతో వాయు నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ బూడిద మేఘం దీర్ఘకాలం భారత్‌పై నిలిచే అవకాశాలు తక్కువే అని ఐఎండీ తెలిపింది. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకూ ఇది భారత గగనతలాన్ని దాటిపోతుందని, తరువాత చైనా దిశగా తరలిపోతుందని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, మధ్యంతర కాలంలో ఆరోగ్య సమస్యలు, విమాన రాకపోకల్లో అంతరాయం వంటి ప్రమాదాలు ఉండొచ్చని హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అగ్నిపర్వతం నుంచి వెలువడిన బూడిద ఆకాశాన్ని చీకటిగా, మసకగా మారుస్తుంది. దీనివల్ల విమాన సర్వీసులపై ఎఫెక్ట్ పడనుంది. మనుషుల ఆరోగ్యం పైనా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. బూడిద మేఘాలతో విమానాలకు విజిబిలిటీ తగ్గుతుంది. దీంతో విమానాల ఆలస్యం లేదా దారి మళ్లించడం చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఇలాంటి మేఘాల్లో నుంచి విమానాలు వెళ్లినప్పుడు వాటి ఇంజిన్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. వాతావరణ పరిస్థితులు ఇలాగే మారుతున్న నేపధ్యంలో అధికారులు ప్రజలకు అవసరంలేని ప్రయాణాలు నివారించాలని, వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
