Modi Gift to Putin : భారత్ పర్యటన(India tour)కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Russian President Vladimir Putin)కు, భారతీయ సంస్కృతి (Indian culture)వైభవాన్ని ప్రతిఫలించే అరుదైన బహుమతులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)అందించారు. 23వ భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అందజేసిన ఈ కానుకలు, రెండు దేశాల మధ్య ఉన్న సుహృద్భావాన్ని మరింత బలోపేతం చేసేలా ప్రత్యేక భావాన్ని మోసుకొచ్చాయి. ప్రతి బహుమతి భారతీయ సంప్రదాయాలు, కళల వైవిధ్యం, హస్తకళల నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ఎంపిక చేయబడింది. ఈ బహుమతుల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్నది రష్యన్ భాషలోకి అనువదించిన శ్రీమద్ భగవద్గీత. భారతీయ ఆధ్యాత్మికతకు మూలస్తంభమైన గీత, జీవన విలువలు, ధర్మం, మానసిక స్థైర్యానికి మార్గనిర్దేశం చేస్తుంది. పుతిన్ సులభంగా చదవగలిగేలా ప్రత్యేకంగా రష్యన్ అనువాదాన్ని భేటీ చేసిన మోదీ, తన వ్యక్తిగత గౌరవాన్ని కూడా ఈ కానుక ద్వారా వ్యక్తం చేశారు.
తదుపరి ప్రత్యేక బహుమతిగా జీఐ ట్యాగ్ పొందిన అస్సాం బ్లాక్ టీను అందించారు. సంప్రదాయ పద్ధతుల్లో తయారయ్యే అస్సాం టీ, తన సువాసన, ఆరోగ్య ప్రయోజనాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. ఈ టీ భారతీయ వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముర్షిదాబాద్ వెండి టీ సెట్ మరో ఆకర్షణీయ కానుక. నైపుణ్యంతో చెక్కిన కళాత్మక డిజైన్లు, సాంప్రదాయ వెండి పనితనాన్ని స్పష్టంగా చూపిస్తాయి. భారత్, రష్యా రెండిటి సంస్కృతుల్లోనూ టీకి ఉన్న ప్రత్యేకతను ఈ సెట్ సూచిస్తోంది. రెండు దేశాల మధ్య మైత్రి భావనకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. మహారాష్ట్రకు చెందిన చేతితో తయారైన వెండి గుర్రం ప్రతిమ ఈ బహుమతుల్లో ప్రత్యేకమైనది. ముందుకు దూసుకెళ్తున్న భంగిమలో ఉన్న ఈ గుర్రం, ధైర్యం, శక్తి, పురోగతి సంకేతాలను ప్రతిబింబిస్తుంది. భారత్-రష్యా సంబంధాలు కాలక్రమేణా మరింత బలపడుతున్నాయనే సంకేతాన్ని ఈ ప్రతిమ అందిస్తుంది.
“ఒక జిల్లా–ఒక ఉత్పత్తి” పథకం పరిధిలో ఆగ్రాలో రూపొందించిన పాలరాతి చదరంగం సెట్ కూడా బహుమతుల్లో చోటు దక్కించుకుంది. పాలరాయి, చెక్క, విలువైన రాళ్లతో చేసిన ఈ శతరంజ్ సెట్, ఉత్తర భారత కళానైపుణ్యానికి అద్భుత ఉదాహరణ. వ్యూహాత్మక ఆలోచన, బుద్ధిపరమైన పోటీని సూచించే ఈ బహుమతి, రెండు దేశాల నాయకత్వాల మధ్య ఉన్న మేధో బంధాన్ని ప్రతిబింబిస్తోంది. ఇవన్నింటికితోడు, కశ్మీర్ లోయలలో పండే ప్రఖ్యాత కుంకుమపువ్వును కూడా పుతిన్‌కు అందించారు. ‘రెడ్ గోల్డ్’గా పేరుపొందిన ఈ సుగంధ ద్రవ్యం తన ప్రకాశవంతమైన రంగు, ఘనీభవించిన వాసన, విలువైన రుచితో ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. జీఐ ట్యాగ్ పొందిన ఈ కుంకుమపువ్వు కాశ్మీర్ భూభాగపు సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. మొత్తంగా, ఈ అన్ని బహుమతులు భారతీయ కళ, సంస్కృతి, సంప్రదాయాల వైవిధ్యాన్ని ప్రతిఫలిస్తూ, భారత్–రష్యా శాశ్వత మైత్రిని మరింత గాఢం చేశాయి.
