end
=
Monday, April 29, 2024
క్రీడలుFIFA World cup:ముచ్చటగా మూడోసారి
- Advertisment -

FIFA World cup:ముచ్చటగా మూడోసారి

- Advertisment -
- Advertisment -

  • 2022 ఫిపా వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌గా అర్జెంటీనా
  • 36 ఏళ్ల నిరీక్షణకు ముగింపు, సాకారమైన మెస్సీ కల
  • గోల్డెన్‌ బూట్‌ అవార్డు దక్కించుకున్న ఎంబప్పే


2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో (FIFA World cup) అర్జెంటీనా (Argentina) విశ్వ విజేతగా (World champion) నిలిచింది. ఖతార్ (Quarter)వేదికగా జరిగిన ఫైనల్ (final)మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ను (France) ఓడించి 36 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. స్టార్ ప్లేయర్ మెస్సీ కల (Lionel Messi)సాకారమై అర్జెంటీనా మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి టైటిల్ కరువును తీర్చుకుంది. ఆదివారం రాత్రి ఫ్రాన్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో విజయం సాధించి సుదీర్ఘ కాలం తర్వాత వరల్డ్ కప్‌ను ముద్దాడింది. పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్‌పై విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది ఫైనల్‌ ఫైట్‌. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగించింది. ఏకంగా రెండు గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ గోల్స్ ఏమీ చేయలేకపోయింది. ముఖ్యంగా అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సి.. మరోసారి మెస్మరైజ్‌ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి గోల్‌ కొట్టి.. అర్జెంటీనా అభిమానుల్లో జోష్‌ నింపాడు.

అయితే మొదటినుంచి హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో మొదటగా అర్జెంటీనా ఆధిక్యం సాధించింది. ఆట 79వ నిమిషం వరకూ విశ్వ విజేత అర్జెంటీనానే అని అంతా భావించారు. కానీ, అంతలోనే ఫ్రాన్స్‌ స్టార్‌ స్ట్రైకర్‌ ఎంబప్పే (Kylian Mbappe)దూకుడు ఆడుతూ ఒక్క నిమిషం వ్యవధిలోనే రెండు గోల్స్‌ (Goals) చేశాడు. మ్యాచ్‌ ముగిసే సరికి స్కోరు సమం అయింది. దీంతో ఎక్స్‌ట్రా టైమ్‌ అరగంటలోనూ చెరో గోల్‌తో నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది. చివరకు పెనాల్టీ షూటౌట్‌ (Penalty shootout)కు మ్యాచ్‌కు దారితీయగా.. ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగింది. చివరగా 1986లో దిగ్గజ మారడోనా (Maradona) విశ్వ కప్‌ అందిస్తే 36 ఏళ్ల తర్వాత తమ దేశవాసుల కలను సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ సాకారం చేయడం విశేషం. కాగా చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్న దిగ్గజం మెస్సీకి ఘనమైన వీడ్కోలు ఇచ్చింది.

(Rajnath Singh:భారత్ సూపర్‌పవర్‌గా నిలుస్తోంది)

ఇక అర్జెంటీనాకు ఇది మూడో వరల్డ్‌కప్‌ టైటిల్‌ (Title). కాగా 1978, 1986లో రెండుసార్లు ట్రోఫీ అందుకుంది. మూడు కంటే ఎక్కువ వరల్డ్‌ కప్‌ టైటిళ్లు నెగ్గిన నాలుగో జట్టు అర్జెంటీనా. బ్రెజిల్‌ ఐదుసార్లు.. జర్మనీ, ఇటలీ (Brazil, Germany, Italy) నాలుగేసి సార్లు కప్‌ సాధించాయి. ఆద్యంతం మలుపులు.. క్షణాల్లో మారిన సమీకరణలు.. ఆఖరి నిమిషాల్లో ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టాయి. మ్యాచ్‌లో అర్జెంటీనాదే ఆధిపత్యం.. మరో 10 నిమిషాలు అదే ఆధిక్యాన్ని నిలబెట్టుకొంటే.. కలల కప్‌ను అందుకొనే తరుణం. కానీ, అంతలోనే ఎంబప్పే డబుల్‌ ధమాకాతో ఫ్రాన్స్‌ ఆశలను సజీవంగా ఉంచాడు. ఇక, ఎక్స్‌ట్రా టైమ్‌లో మెస్సీ మాయాజాలంతో అర్జెంటీనా మరోసారి గెలుపు అంచున నిల్చున్నా.. ఫౌల్‌ చేయడంతో ఎంబప్పే మళ్లీ స్కోరు సమం చేశాడు. కానీ, షూటౌట్‌లో అర్జెంటీనా గోల్‌ కీపర్‌ ఎమిలియానో మార్టినెజ్‌ (Emiliano Martinez) హీరోచిత ప్రదర్శనతో తన జట్టుకు మూడోసారి వరల్డ్‌కప్‌ అందించాడు.

అర్జెంటీనా అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. కిలియన్‌ ఎంబప్పే హ్యాట్రిక్‌ గోల్స్‌తో పోరాడినా.. ఫ్రాన్స్‌ను షూటౌట్‌ చేసిన లియోనెల్‌ మెస్సీ సేన.. విశ్వవిజేత కిరీటాన్ని సొంతం చేసుకొంది. మెగా కప్‌పై 20 ఏళ్ల యూరోపియన్‌ ఆధిపత్యానికి లాటిన్‌ అమెరికా జట్టు ఎట్టకేలకు తెరదించింది. వరుసగా రెండోసారి నెగ్గి చరిత్రను తిరగరాయాలనుకున్న ఫ్రాన్స్‌కు నిరాశే ఎదురైంది. మెగా ఫైనల్లో అర్జెంటీనా 3-3 (4-2)తో ఫ్రాన్స్‌ను ఓడించి మూడోసారి ప్రపంచక్‌పను సొంతం చేసుకొంది. అర్జెంటీనా తరఫున మెస్సీ (23, 108వ), డిమారియా (36వ) గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ తరఫున ఎంబప్పే (80, 81, 118వ) మూడు గోల్స్‌తో అదరగొట్టాడు. ఇక, షూటౌట్‌లో అర్జెంటీనా 4 స్కోరు చేయగా.. ఫ్రెంచ్‌ టీమ్‌ 2 కిక్‌లను మాత్రమే గోల్‌లోకి పంపగలిగింది. కొమాన్‌ కొట్టిన కిక్‌ను అర్జెంటీనా కీపర్‌ మార్టినెజ్‌ గొప్పగా అడ్డుకోగా.. తౌమెనీ బయటకు కొట్టాడు.

ఇక సమవుజ్జీలుగా బరిలోకి దిగినా.. అర్జెంటీనా వేగంగా మ్యాచ్‌పై పట్టుసాధించింది. మెస్సీ సేన ఎటాకింగ్‌ ఆటతో చెలరేగడంతో.. ఫ్రాన్స్‌ డిఫెన్స్‌కే పరిమితమైంది. అర్జెంటీనా బంతిని ఎక్కువగా తమ నియంత్రణలో ఉంచుకోవడంతో ఫస్టా్‌ఫ్‌లో ఫ్రెంచ్‌ టీమ్‌.. ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై ఒక్కసారి కూడా దాడి చేయలేక పోయింది. తొలి 15 నిమిషాల్లో అర్జెంటీనా రెండుసార్లు ఫ్రాన్స్‌ గోల్‌పోస్టుపైకి దాడులు చేసినా.. పకడ్బందీగా ముగించలేక పోయింది. అయితే, 17వ నిమిషంలో అర్జెంటీనా డి-బాక్స్‌ బయట హెర్నాండెజ్‌ను రొమీరో మొరటుగా అడ్డుకోవడంతో రెఫరీ ఫ్రాన్స్‌కు ఫ్రీకిక్‌ ఇచ్చాడు. ఈ కిక్‌ను గ్రీజ్‌మెన్‌ కొట్టగా.. పెనాల్టీ ఏరియాలో గిరోర్డ్‌ హెడర్‌తో నెట్‌లోకి కొట్టే ప్రయత్నం చేసినా.. అది బయటకు పోయింది. అనంతరం కౌంటర్‌ ఎటాక్‌ చేసిన అర్జెంటీనా తగిన ఫలితం సాధించింది. 21వ నిమిషంలో అల్వరెజ్‌ ఇచ్చిన పాస్‌ను అందుకొన్న డిమారియా.. ఫ్రాన్స్‌ పెనాల్టీ ఏరియాలోకి చొచ్చుకెళ్లాడు. కానీ, వెనుక నుంచి డెంబీలి అతడిని కిందపడేయడంతో.. రెఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. దీన్ని మెస్సీ కూల్‌గా గోల్‌లోకి పంపి అర్జెంటీనాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఫ్రాన్స్‌ సమం చేసేందుకు దాడుల తీవ్రతను పెంచినా.. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేక పోయింది. ఈ క్రమంలో 36వ నిమిషంలో మ్యాక్‌ అలిస్టర్‌ మెరుపు వేగంతో చేసిన దాడితో ఫ్రెంచ్‌ టీమ్‌ డీలాపడింది. బంతిని అందుకొన్న మెస్సీ.. దాన్ని చాకచక్యంగా అలిస్టర్‌కు పాస్‌ చేయగా.. అతడు ప్రత్యర్థి గోల్‌పోస్టువైపు దూసుకెళ్లాడు. పెనాల్టీ ఏరియాలో తెలివిగా వ్యవహరించిన అలిస్టర్‌.. నేరుగా షాట్‌ కొట్టకుండా డిమారియాకు పాస్‌ ఇవ్వగా.. అతడు గోల్‌ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని నెట్‌లోకి పంపాడు. దీంతో అర్జెంటీనా 2-0తో మెరుగైన స్థితిలో నిలిచింది. ఆ తర్వాత ఫ్రాన్స్‌ కొన్ని సబ్‌స్టిట్యూట్‌లతో అర్జెంటీనాపై ఎటాక్‌ చేసినా.. సరైన అవకాశాలను మాత్రం సృష్టించుకోలేక పోయింది.

సెకండా్‌ఫలో మాత్రం ఫ్రెంచ్‌ టీమ్‌ వ్యూహం మార్చి.. ఆటలో వేగం పెంచింది. దీంతో అర్జెంటీనా దాడులు తగ్గించి.. వారిని అడ్డుకోవడానికే పరిమితమైంది. కానీ, మ్యాచ్‌ మరో పది నిమిషాల్లో ముగుస్తుందనగా.. ఎంబప్పే పిడుగులా విరుచుకుపడడంతో సీన్‌ మొత్తం మారిపోయింది. నిమిషం తేడాతోనే అతడు రెండు గోల్స్‌ చేసి ఫ్రాన్స్‌ను మళ్లీ మ్యాచ్‌లో నిలిపాడు. 79వ నిమిషంలో అర్జెంటీనా పెనాల్టీ ఏరియాలో కోలో మువానిని ఒటమెడి అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. ఎంబప్పే గోల్‌ చేశాడు. అర్జెంటీనా తేరుకొనేలోగా ఎంబప్పే మరో గోల్‌ చేసి 2-2తో స్కోరు సమం చేశాడు. తురామ్‌తో సమన్వయం చేసుకొంటూ వేగంగా కదిలిన ఎంబప్పే.. పవర్‌ఫుల్‌ కిక్‌తో బంతిని నెట్‌లోకి పంపాడు. ప్రత్యర్థి కీపర్‌ మార్టినెజ్‌ ఆపే ప్రయత్నం చేసినా.. అతడి చేతికి తగిన బంతి గోల్‌లో పడడంతో.. మెస్సీ సేన విస్తుపోయింది. స్టాపేజ్‌ టైమ్‌లో గోల్‌ పోస్టు వద్ద పాస్‌ను అందుకొన్న మువాని.. నెట్‌లోకి కొట్టే ప్రయత్నం చేసినా మార్టినెజ్‌ అద్భుతంగా అడ్డుకొన్నాడు. మరో రెండు నిమిషాల తర్వాత మెస్సీ గోల్‌ చేసినంత పని చేశాడు. అకునా నుంచి బంతిని అందుకొన్న మెస్సీ.. డిఫెండర్‌ను తప్పిస్తూ నేరుగా కొట్టిన కిక్‌ను ఫ్రాన్స్‌ కీపర్‌ లోరిన్‌ గాల్లోకి ఎగురుతూ బయటకు నెట్టివేయడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారి తీసింది.

ఎక్స్‌ట్రా టైమ్‌ ఫస్టా్‌ఫలో అర్జెంటీనాకు చక్కని అవకాశాలు లభించినా.. ఫ్రాన్స్‌ డిఫెండర్‌ యూపమెకానో అప్రమత్తతతో వాటిని అడ్డుకొన్నాడు. 105వ నిమిషంలో లాటరో మార్టినెజ్‌ కొట్టిన కొక్‌ను టచ్‌తో యూపమెకానో బయటకు పంపగా.. ఆ తర్వాత అకునా కొట్టిన మంచి షాట్‌ను కూడా బ్లాక్‌ చేశాడు. ఇక, సెకండాఫ్‌ 108వ నిమిషంలో మెస్సీ గోల్‌ చేసి అర్జెంటీనాలో జోష్‌ నింపాడు. లాటరో కొట్టిన షాట్‌ను ఫ్రాన్స్‌ కీపర్‌ అడ్డుకోగా.. రీబౌండ్‌ అయిన బంతిని మెస్సీ గోల్‌లోకి పంపాడు. కానీ, ఆనందం ఎంతోసేపు నిలవలేదు. 116వ నిమిషంలో మాంటెల్‌ చేతికి బంతి తగలడంతో ఫ్రాన్స్‌కు స్పాట్‌ కిక్‌ లభించింది. దీన్ని గోల్‌గా మలచిన ఎంబప్పే 3-3తో మరోసారి స్కోరు సమం చేయడంతో.. ఫలితం షూటౌట్‌కు దారి తీసింది. తీవ్ర ఒత్తిడిని అధిగమించిన అర్జెంటీనా చాంపియన్‌గా నిలిచింది.

ఈసారి ప్రపంచ కప్‌లో మొత్తం 32 జట్లు తలపడినా..ప్రధానంగా రెండు టీమ్‌లు అర్జెంటీనా, పోర్చుగల్‌ వాటిల్లో లియోనెల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోపైనే సాకర్‌ ఫ్యాన్స్‌ దృష్టి నిలిచింది. కారణం ఈ తరం ఫుట్‌బాల్‌ క్రీడలో ఈ ఇద్దరు తిరుగులేని స్టార్లు కావడమే. ఇంకా..35 ఏళ్ల మెస్సీ, 37 సంవత్సరాల రొనాల్డోకు ఇదే చివరి మెగా టోర్నమెంట్‌ కావడం. దాంతో ఈ ఇద్దరు సూపర్‌ స్టార్లలో ఎవరు ప్రతిష్ఠాత్మక టైటిల్‌ కలను సాకారం చేసుకుంటారోనన్న ఉత్కంఠ అభిమానుల్లో ఏర్పడింది. అయితే పోర్చుగల్‌ జట్టు క్వార్టర్‌ఫైనల్లో నిష్క్రమించడంతో రొనాల్డో ఫ్యాన్స్‌లో సైతం మెస్సీ ఏ మాయ చేస్తాడనే ఆసక్తి పెరిగిపోయింది. సౌదీ అరేబియాతో గ్రూప్‌ ఆరంభ మ్యాచ్‌లో 1-2తో అర్జెంటీనా కంగుతినడం టోర్నమెంట్‌లోనే పెను సంచలనమైంది. ఇక అర్జెంటీనా కప్‌ ఏం సాధిస్తుందిలే..అని వ్యాఖ్యానించినవారూ లేకపోలేదు. కానీ ఆ ఓటమి..టోర్నమెంట్‌లో ఎలా కొనసాగాలనే అర్జెంటీనా జట్టు దృక్పథాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ జట్టులో కసిని, పట్టుదలను పెంచింది. 1986లో దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా ఎలాగైతే తన సారథ్యంలో ఒంటిచేత్తో అర్జెంటీనాకు ప్రపంచ కప్‌ అందించాడో..ఈసారి మెస్సీ తన కెప్టెన్సీలో అదే తరహాలో జట్టును మరోసారి జగజ్జేతగా నిలిపాడు. తద్వారా 19 ఏళ్ల తన సాకర్‌ కెరీర్‌ను విశ్వక్‌పతో లియోనెల్‌ పరిపూర్ణం చేసుకున్నాడు. ఈసారి టోర్నమెంట్‌లో సెమీఫైనల్‌ వరకు అర్జెంటీనా జట్టు కొట్టిన షాట్లలో 56.3 శాతం మెస్సీవే కావడం గమనిస్తే అతడి పాత్ర ఎంత కీలకమో అర్థమవుతుంది.

36 ఏళ్ల కిందట అర్జెంటీనా ప్రపంచ చాంపియన్‌గా నిలిచినప్పుడు మారడోనా కొట్టిన షాట్ల శాతం 56.4 కావడం విశేషం. ఈసారి మెస్సీ ఏడు గోల్స్‌ కొట్టాడు. కళ్లు చెదిరే డ్రిబ్లింగ్‌తో, డిఫెండర్లను అయోమయానికి గురి చేసే పాస్‌లతో, ప్రత్యర్థి గోల్‌కీపర్లకు అందకుండా అతడు చేసిన ఈ గోల్స్‌ వేటికవే ప్రత్యేకమైనవి. మెక్సికోతో చావో రేవో అయిన గ్రూప్‌ పోరులో మెస్సీ చేసిన గోల్‌ అద్భుతం..అనన్య సామాన్యం. 25 గజాల దూరం నుంచి ఎడమ కాలితో కొట్టిన షాట్‌ గురి తప్పని బుల్లెట్‌లా గోల్‌పో్‌స్టలోకి దూసుకుపోవడం మెస్సీ అమోఘ ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుంది. ఇక సెమీఫైనల్లో..తననే వెంటాడుతున్న క్రొయేషియా డిఫెండర్‌ గర్డియోల్‌ను ఒక్కసారి ఏమార్చి అల్వరేజ్‌కు పాస్‌ అందించడం..ఆ పాస్‌ను అల్వరేజ్‌ గోల్‌గా మలచడాన్ని ఏమని వర్ణించగలం. ఇలా అరుదైన ప్రతిభతో సమకాలీన సాకర్‌ చరిత్రలో తనకంటూ ఎన్నో పేజీలు లిఖించుకున్న మెస్సీ ప్రపంచ కప్‌ను సగర్వంగా అందుకోవడం అతడికేకాదు..మెస్సీ ఫ్యాన్స్‌కూ జీవితంలో అపురూప క్షణాలు.

ఒక టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాళ్లకిచ్చే గోల్డెన్‌ బూట్‌ (The Golden Boot) అవార్డును ఈసారి ఫ్రాన్స్‌ హీరో ఎంబప్పే (Kylian Mbappe.)దక్కించుకున్నాడు. ఫైనల్‌కు ముందు అర్జెంటీనా స్టార్‌ మెస్సీ, ఎంబప్పే చెరో ఐదు గోల్స్‌తో సమంగా నిలిచినా.. తుదిపోరులో మెస్సీ రెండు గోల్స్‌ కొట్టగా, ఎంబప్పే మూడు గోల్స్‌తో విజృంభించాడు. దీంతో ఎంబప్పే అత్యధికంగా 8 గోల్స్‌తో గోల్డెన్‌ బూట్‌ దక్కించుకున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -