Nara Lokesh: హైదరాబాద్‌ను మైక్రోసాఫ్ట్(Microsoft) ఎలా ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిందో అదే తరహాలో ఇప్పుడు విశాఖపట్నం(Visakhapatnam) గూగుల్(Google) పెట్టుబడులతో ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెందనుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఇది గుణాత్మక మలుపు అని పేర్కొన్నారు. గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence)కు సంబంధించిన అనేక స్టార్టప్‌లు, కంపెనీలు విశాఖకు తరలివస్తున్నాయి. ఈ పెట్టుబడులు రాష్ట్రానికి కొత్త దారులు తెరుస్తాయి. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. దీని వల్లే ఇంతమంది పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని ఆశ్రయిస్తున్నారు అని లోకేశ్ చెప్పారు.
2024 సెప్టెంబర్‌లో గూగుల్ ప్రతినిధులు విశాఖను సందర్శించినట్లు వెల్లడించిన ఆయన, వారికి డేటా సెంటర్ కోసం స్థలాన్ని చూపించినట్లు తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే ఆయన అమెరికా వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశారు. నవంబర్‌లో గూగుల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. ఈ పెట్టుబడుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు అనేకసార్లు చర్చలు జరిపినట్లు చెప్పారు. గూగుల్ పెట్టుబడుల ద్వారా లక్ష మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని వివరించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంప్డ్ స్టోరేజ్ యూనిట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు కానున్నాయని, చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తుండామని వెల్లడించారు.
శ్రీసిటీలో బ్లూస్టార్, డైకెన్, ఎల్జీ వంటి దిగ్గజ సంస్థలు తమ పెట్టుబడులు పెంచుతున్నాయని, ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టుతోందని చెప్పారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను తీసుకురావడమే కాకుండా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి ఐటీ దిగ్గజాలు విస్తరిస్తున్నాయని చెప్పారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని కాదు.. మేము అభివృద్ధిని వికేంద్రీకరించాలనుకుంటున్నాం. ప్రతి జిల్లాలోనూ పరిశ్రమల వృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. మేము కేవలం ఎంవోయూలపై సంతకాలు చేయడమే కాకుండా వాటిని కార్యరూపంలోకి తీసుకువస్తున్నాం. ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మళ్లీ అభివృద్ధి పునఃప్రారంభమైంది. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్లను చూసాం, కానీ ఏపీలో మాత్రం డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ విధానం నడుస్తోంది అని నారా లోకేశ్ స్పష్టం చేశారు.