Ibomma Ravi: తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu film industry) కు భారీ నష్టాన్ని మిగులుస్తూ కొత్త సినిమాలను వరుసగా పైరసీ చేస్తున్న ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు రవి ఇమ్మడి ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆత్మవిశ్వాసం పేరుతో “దమ్ముంటే పట్టుకోగలిగితే పట్టుకోండి” అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవి, చివరకు చట్టం ముందు లొంగక తప్పలేదు. అరెస్టు అనంతరం జరిగిన విచారణలో అతడు చెప్పిన వివరాలు అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా భార్య, అత్త నుంచి ఎదురైన అవమానాలే తనను నేర ప్రపంచంలోకి నెట్టాయని రవి ఒప్పుకున్నాడు. వివరాలకు వస్తే..వెబ్ డిజైనర్‌గా పనిచేసే రవి, 2016లో తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొదటిదాకా అంతా బాగానే సాగినా, తరువాత అతని ఆదాయం తక్కువేనంటూ భార్య, అత్తలు తరచూ అవమానపరుస్తుండేవారని విచారణలో వెల్లడించాడు.
డబ్బు సంపాదించే ప్రతిభ లేదని అన్న మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. నిరూపించాలనే తపనతోనే ఈ విషయం మొదలైంది అని రవి చెప్పినట్టు సమాచారం. అలా ఆవేశం, ఆతురతలో తనకున్న టెక్నికల్ జ్ఞానాన్ని తప్పుదోవ పట్టించి, ‘ఐబొమ్మ’, ‘బప్పం టీవీ’ వంటి పైరసీ సైట్లు రూపొందించాడు. కొద్దికాలంలోనే ఈ సైట్ల ట్రాఫిక్ పెరగడంతో అనేక బెట్టింగ్ యాప్స్ నుంచి భారీ మొత్తంలో ప్రకటనలు వచ్చాయి. ఫలితంగా రవి నెలకు లక్షలు సంపాదించే స్థాయికి చేరుకున్నాడు. అయితే, డబ్బు వచ్చినా తనతో కలిసి నివసించడానికి భార్య ఒప్పుకోకపోవడంతో 2021లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత రవి నెదర్లాండ్స్‌కు వెళ్లి అక్కడే తన కార్యకలాపాలను కొనసాగించాడు. విదేశీ సర్వర్ల సహాయంతో తన పైరసీ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాడు.
ఈ క్రమంలో సుమారు 50 లక్షల మంది యూజర్ల వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లకు, అంతర్జాతీయ గేమింగ్ గ్యాంగ్‌లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ వ్యాపారంతో రవి దాదాపు రూ. 20 కోట్లు సంపాదించినట్టు విచారణలో తేలింది. తన చివరి ప్లాన్‌గా కూకట్‌పల్లిలోని ఫ్లాట్‌ను అమ్మి, ఆ డబ్బుతో విదేశాల్లో శాశ్వతంగా స్థిరపడాలని యోచించి హైదరాబాద్‌కు వచ్చిన రవిని, ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను వెల్లడించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్, చట్టానికి సవాల్ విసిరే నేరస్తుడెవరైనా చివరికి జైలుకే వెళ్తారని కఠిన హెచ్చరిక చేశారు. ఉచితంగా సినిమాలు చూపించే సైట్ల వెనుక యూజర్ల డేటాను దోచుకునే దుష్ట ఉద్దేశ్యం దాగి ఉంటుందని, ఇలాంటి పైరసీ వెబ్‌సైట్లను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని ఆయన సూచించారు.
