end
=
Monday, January 26, 2026
వార్తలురాష్ట్రీయంటీటీడీ కల్తీ నెయ్యి కేసు.. జాబితాలో మరో 11 మంది నిందితులు
- Advertisment -

టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. జాబితాలో మరో 11 మంది నిందితులు

- Advertisment -
- Advertisment -

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కేసులో సీబీఐ పర్యవేక్షణలో పనిచేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (Sit)విచారణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు దర్యాప్తు దశలోనే పలువురు అధికారులను నిందితుల జాబితాలో చేర్చుతూ కేసు కీలక మలుపు తిరుగుతోంది.
కేసు నమోదు చేసిన తొలి దశలో 15 మందిని నిందితులుగా పేర్కొన్న సిట్, తరువాతి విచారణలో మరో 9 మందిని జాబితాలో చేరుస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చింది. తాజాగా దర్యాప్తు ఆధారాలతో కొత్తగా మరో 11 మందిని నిందితులుగా చేర్చే మెమోను నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. వీరి మధ్య ప్రత్యేకంగా గమనించదగ్గ విషయం కొత్తగా చేర్చిన వారిలో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు ఉండటం.

2019 నుంచి 2024 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన పలువురు జీఎంలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ల పాత్రపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీరు విధుల్లో ఉన్న సమయంలోనే నెయ్యి కొనుగోలు, నాణ్యత పరీక్షలు, సరఫరాదారుల ఎంపిక వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు దర్యాప్తు బృందానికి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అందువల్లే ఈ అధికారులను నేరుగా నిందితులుగా పేర్కొంటూ సిట్ ముందడుగు వేసింది. ఇప్పటికే జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి, మురళీకృష్ణ, అలాగే ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి పేర్లు గతంలోనే నిందితుల జాబితాలో చేరాయి. ఇప్పుడు కొత్తగా చేర్చిన 11 మందితో కలిపి కేసులో మొత్తం నిందితుల సంఖ్య 35కి పెరిగింది. వారిలో ఇప్పటివరకూ 10 మందిని సిట్ అరెస్టు చేయడం విచారణ వేగాన్ని సూచిస్తోంది. టీటీడీ ధార్మిక సేవలతో పాటు నాణ్యమైన ప్రసాదాల తయారీలో ఎంతో ప్రతిష్ఠను నిలబెట్టుకున్న సంస్థ. అయితే, ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన కల్తీ నెయ్యి ఆరోపణలు టీటీడీ ప్రతిష్ఠకు పెద్ద దెబ్బతీశాయి.

నెయ్యి కొనుగోలు, పరీక్ష, నిల్వల వంటి విషయాల్లో కొందరు అధికారుల నిర్లక్ష్యం లేదా అవినీతి కారణంగా నాణ్యతకు భంగం కలిగినట్టు సిట్ చేసిన ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. మరింత మంది అధికారులను నిందితులుగా చేర్చిన నేపథ్యంలో, విచారణ మరింత కీలక దశలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్టు దర్యాప్తు వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. టీటీడీలో కొనుగోలు విధానాలపై, కాంట్రాక్టర్లపై, నాణ్యత నియంత్రణ వ్యవస్థపై కూడా సిట్ సమగ్రంగా పరిశీలన కొనసాగిస్తోంది. ఈ కేసు పూర్తిస్థాయి దర్యాప్తు ముగిశాక నిజానిజాలు వెలుగులోకి రానున్నాయి. ఇంతలో టీటీడీలో భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు పునరావృతం కాకుండా చర్యలు కట్టుదిట్టం చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -