నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న మిస్సింగ్ కేసులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నామని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా పరిధిలో నమోదవుతున్న కేసులన్నీ వారివారి వ్యక్తిగత, మనస్పర్థల వల్లనే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు మా వద్ద ఉన్న సమాచారం. మైనర్లు తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్న కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. మిస్సింగ్ కేసు నమోదైన వెంటనే మా టీమ్ రంగంలోకి దిగుతోంది. ప్రతి కేసును మేము ఛాలెంజ్‌గానే తీసుకుంటున్నాము.
ఇటీవలే మిస్సైన ఓ డాక్టర్ కేసు, గచ్చిబౌలిలో మరో కేసు, పూణే అమ్మాయి కేసు వీటన్నింటినీ కూడా మేము స్పెషల్ టీమ్స్‌తో చేధించాం. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. చిన్న చిన్న కారణాలకే పిల్లలు ఇంటి నుంచి అలిగి వెళ్లిపోతున్నారు. భార్యాభర్తల గొడవలు కూడా మరికొన్ని మిస్సింగ్ కేసులకు కారణం. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రులపై గౌరవం ఉండాలి. తల్లిదండ్రులకు పిల్లలపై దృష్టి ఉండాలి. అప్పుడే కాస్తయినా ఈ మిస్సింగ్ కేసులను అరికట్టగలం అని సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో తెలిపారు.