26/11 Mumbai Terror Attack: దేశ ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)పై పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాదులు (Terrorists)జరిపిన ఘోర ఉగ్రదాడికి నేటితో 17 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 నవంబర్ 26 భయానక రాత్రి సృష్టించిన రక్తపాతాన్ని స్మరించుకుంటూ దేశం అంతటా అమరవీరులకు నివాళులు అర్పిస్తోంది. ఈ సందర్భంగా ‘నెవర్ ఎవర్’ (మళ్లీ ఎప్పటికీ జరగకూడదు) అనే సందేశంతో గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ప్రత్యేక స్మారక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదిహేడు సంవత్సరాల క్రితం సముద్ర మార్గం ద్వారా భారత భూభాగంలోకి చొరబడ్డ 10 మంది లష్కరే తోయిబా తీవ్రవాదులు ముంబై నగరాన్ని రక్తపాతం లో ముంచెత్తారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, తాజ్ మహల్ హోటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, నారిమన్ హౌస్ వంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటూ వారు నాలుగు రోజుల పాటు నగరాన్ని అతలాకుతలం చేశారు.
ఈ దారుణ ఘటనలో 166 నిరపరాధులు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా దళాలు భీకర పోరాటంలో 9 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగా, ఏకైకంగా ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ కసబ్‌కు అనంతరం ఉరి శిక్ష అమలు అయింది. ఈ బాధాకర దినాన్ని గుర్తుచేసుకుంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఎన్‌ఎస్‌జీ ఆధ్వర్యంలో గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద స్మారక సభ నిర్వహిస్తున్నారు. ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన బాధితుల ఫొటోలతో ప్రత్యేక స్మారక గ్యాలరీని ఏర్పాటు చేశారు. ముంబైలోని 11 కళాశాలలు, 26 పాఠశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని శాంతి, ఐక్యత, జాతీయ భద్రతకు సంబంధించిన ప్రతిజ్ఞ స్వీకరిస్తున్నారు. రాత్రి వేళ గేట్‌వే ఆఫ్ ఇండియాను త్రివర్ణ పతాక వర్ణాలతో అలంకరించడంతో పాటు ‘నెవర్ ఎవర్’ అనే సందేశాన్ని ప్రకాశవంతంగా ప్రదర్శించనున్నారు.
ఇదిలా ఉండగా, ఈ దాడుల ప్రధాన సూత్రధారి తహవ్వూర్ రాణా కేసులో దర్యాప్తు వేగవంతమవుతోంది. రాణా సంబంధిత కీలక వివరాలపై స్పష్టత కోసం అమెరికా ప్రభుత్వాన్ని ఎన్ఐఏ ఇప్పటికే అభ్యర్థించినట్టుగా సమాచారం. రాణా పాత్రపై కొత్త ఆధారాలు లభిస్తే 26/11 దాడుల కుట్రకు సంబంధించిన అంతర్జాతీయ నెట్వర్క్‌ను మరింత బలంగా ఛేదించగలమని అధికారులు భావిస్తున్నారు. ముంబైపై జరిగిన ఈ దారుణ దాడి దేశ భద్రతా వ్యవస్థలో అమూల్యమైన మార్పులకు దారితీసింది. అమరవీరుల త్యాగం ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రతి సంవత్సరం ఈరోజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యతను పునరుద్ఘాటించే సందర్భంగా కొనసాగుతోంది.
