వెలుగులోకి పార్టీ సెంట్రల్ కమిటీ డాక్యుమెంట్
గడిచిన ఏడాది కాలంలో మావోయిస్టు పార్టీ (Maoist Party) సానుభూతిపరుడి నుంచి పార్టీ సుప్రీం కమాండర్ (Supreme Commander), జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు (Nambala Kesava Rao) వరకు మొత్తం 357 మంది మావోయిస్టులు నేలకొరిగారని పార్టీ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ (సీసీ)(Central Committee) పేరిట గత జూన్ 23న రాసిన 22 పేజీల డాక్యుమెంట్ (New Doccument)లో ఈ వివరాలు స్పష్టంగా ఉన్నాయి.
ఈ డాక్యుమెంట్ మంగళవారం వెలుగులోకి వచ్చింది. అందులోని వివరాల ప్రకారం…బూటకపు ఎన్‌కౌంటర్లలో 80 మంది చనిపోయారని, మొత్తంగా చనిపోయిన వారిలో 136 మంది మహిళలు ఉన్నారని, ఎదురుకాల్పులు కాకుండా అనారోగ్య కారణాలతో నలుగురు, ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, 23 మంది జిల్లా కమిటీ సభ్యులు, 83 మంది ఏరియా కమిటీ,
138 మంది పార్టీ సభ్యులు, పీఎల్‌జీఏ 17, ఇతర విభాగాల వారు 40, గుర్తించని మృతులు 36 మంది ఉంటారని వివరించింది. వీరి త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. నక్సల్బరీ విప్లవ పోరాటం మొదలైన తర్వాత ఆపరేషన్ కగార్‌తో ఏడాది వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో సెంట్రల్, స్టేట్ కమిటీ సభ్యులను కోల్పోవడంతో తీవ్ర నష్టం జరిగిందని పార్టీ సెంట్రల్ కమిటీ పేర్కొంది.
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన కాంకేర్ ఎన్‌కౌంటర్ (29 మంది మావోయిస్టులు చనిపోయారు) తర్వాత సగటున ప్రతీ 20 రోజులకు ఒక భారీ ఎన్‌కౌంటర్ జరుగుతోందని, ఈ ఘటనల్లో కనిష్టంగా 10 నుంచి గరిష్టంగా 35 మంది వరకు మావోయిస్టులు చనిపోయారని తెలిపింది. 20 కిలోమీటర్ల వలయాకారంలో వేలాది మంది భద్రతాదళాలు చుట్టుముడుతూ తమపై దాడులు చేస్తున్నాయని, ఆధునిక ఆయుధాలు,
టెక్నాలజీ గల భద్రతా దళాలను తమ కేడర్ ప్రాణాలకు తెగించి ఎదుర్కోంటోందని ఆ డాక్యుమెంట్‌లో పేర్కొంది. ప్రతీ ఎదురుకాల్పుల ఘటనలో భద్రతాదళాల వైపు కూడా పది మందికి మించి జవాన్లు చనిపోతున్నారని సెంట్రల్ కమిటీ తెలిపింది. తమకున్న అంచనా ప్రకారం ప్రతిదాడుల్లో 70 మంది జవాన్లు చనిపోగా, 130 మంది తీవ్రంగా గాయపడి ఉంటారని అభిప్రాయపడింది