ఎలాంటి సినిమా నేపథ్యంలో లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ(Telugu Film Industry)లోకి అడుగు పెట్టారు రెజీనా కసాండ్ర(Regina Cassandra). నటిగా 2005లో తమిళ చిత్రసీమ(Collywood)లో అడుగుపెట్టిన ఈ తార 2010లో విడుదలైన ‘ఎస్ఎమ్ఎస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. రెజీనా పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడారు.
‘నాకు 2015 వరకు పనిచేయాలనిపించలేదు. యాక్టింగ్ మానేయాలనుకున్నాను. అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తి చేశాను. 2018 నుంచి అవకాశాలు వరుస పెట్టాయి. ఏం చేయలేక ఒప్పుకున్నాను. కానీ, ఒకే తరహా పాత్రల్లో నటించకూడదన్న నిబంధన పెట్టుకున్నాను. టాలీవుడ్‌లోకి వెళ్లిన తొలినాళ్లలో దర్శకులు, వారి అసిస్టెంట్ డైరెక్టర్లు ఉదయం 6 గంటలకే నా డైలాగులు తెచ్చిచ్చేవారు.
అప్పుడు నాకు తెలుగు భాష రాదు. దీంతో ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అన్ని డైలాగులూ కంఠస్థం చేసేదాన్ని. భావోద్వేగాలను అర్థం చేసుకునేదాన్ని. లైన్ టు లైన్ నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. ఆ కారణంగానే ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలను. నాకు సినీ నేపథ్యం లేదు. ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు నటించి, ఇంటికి వచ్చేయడమే అనుకునేదాన్ని. కానీ, దాంతోపాటు ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉంటాయనేది కాలం గడిచేకొద్దీ బోధపడింది.
పీఆర్, సోషల్‌మీడియా ప్రాధాన్యం గురించి అర్థమైంది. నేను వాటికి చాలా రోజులు దూరంగా ఉన్నాను. కొన్నేళ్లుగా నేను తెలుగు తెరపై కనిపించనప్పటికీ, చిత్ర రంగంలో 20 ఏళ్లు గడిచాయంటే చాలా పెద్ద ఆశ్చర్యం’ అని చెప్పుకొచ్చారు. తమిళ స్టార్ అజిత్‌కుమార్ హీరోగా వచ్చిన ‘పట్టుదల’లోనూ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమె ‘మూకుత్తి అమ్మన్2’ చిత్రంలో నటిస్తున్నారు. సుందర్ సీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.