Gujarat : గుజరాత్ రాష్ట్రంలోని పాలన్‌పూర్‌లో ఓ వినియోగదారుడి ఆగ్రహం ఊహించని రీతిలో వ్యక్తమైంది. తన స్కూటీలో ఏర్పడిన సమస్యకు సంబంధించి షోరూంలో నిర్లక్ష్యమైన స్పందన రావడంతో అసహనానికి లోనైన ఆయన షోరూం(showroom) ముందే తన ఓలా స్కూటీ(Ola Scooty)కి నిప్పంటించి శాంతించాడని సమాచారం. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే పాలన్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్ని నెలల క్రితం ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ(Electric Scooty)ని స్థానిక షోరూంలో కొనుగోలు చేశాడు. కొన్ని రోజుల పాటు స్కూటీ సజావుగా నడిచింది. కానీ ఇటీవల తన భార్య, కుమారుడితో కలిసి షాపింగ్‌కు వెళ్లిన సమయంలో స్కూటీ భారీగా విఫలమైంది. తిరిగివస్తున్నపుడు స్కూటీ హ్యాండిల్ రాడ్ అకస్మాత్తుగా విరిగిపోయింది. దీంతో భారీ ప్రమాదం తప్పిందని తెలుస్తోంది.
ఘటన జరిగిన వెంటనే అతను కుటుంబ సభ్యులను మరో వాహనంలో ఇంటికి పంపించి సమస్యాత్మకంగా మారిన స్కూటీని నేరుగా ఓలా షోరూం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ రిపేర్ కోసం ప్రయత్నించగా కస్టమర్ కేర్ ప్రతినిధుల నుంచి సరైన స్పందన రాలేదట. సమస్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మాట్లాడిన విధానం వినియోగదారుడికి తీవ్ర అసహనం కలిగించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి షోరూం ముందు ఉన్న స్థలంలో స్కూటీకి నిప్పంటించాడు. ఈ ఘటన చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. దట్టమైన పొగలు ఎగసిపడటంతో షోరూం సిబ్బంది, స్థానికులు చలించిపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు అక్కడి స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. వీడియోల్లో ఆ వ్యక్తి కస్టమర్ కేర్ పై ఆగ్రహంతో చేసిన వ్యాఖ్యలు స్కూటీకి నిప్పంటించే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలోనూ ఒకటి, రెండు చోట్ల చోటు చేసుకున్నప్పటికీ, కంపెనీలు వినియోగదారుల ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించాలన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వినియోగదారుల భద్రతను ప్రాముఖ్యతనిస్తూ, రవాణా వ్యవస్థలో నాణ్యత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం స్పష్టమవుతోంది. ఓలా సంస్థ ఇప్పటివరకు ఈ ఘటనపై స్పందించలేదు. అయితే ఈ సంఘటన వినియోగదారుల్లో అసంతృప్తిని, భద్రతాపై అనుమానాలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
షోరూమ్ ముందే ఓలా వాహనానికి నిప్పంటించిన కస్టమర్
స్టీరింగ్ రాడ్ విరిగిపోయిందని చెప్పినా కంపెనీ సిబ్బంది పట్టించుకోలేదని ఆగ్రహం
గుజరాత్–పాలన్పూర్ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా తన ఓలా వాహనం స్టీరింగ్ రాడ్ విరిగిపోయిందని షోరూముకు… pic.twitter.com/JFyax4IzWd
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025