Medical: మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్(Police Training Center)లో తాజాగా పోలీసు సిబ్బంది(Police personnel)కి ప్రేరణాత్మకంగా, జీవన నైపుణ్యాలపై కేంద్రీకృతమైన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, రియల్‌వర్సిటీ వ్యవస్థాపకుడు ఈ. ఉరుకుందు శెట్టి (E. Urukundu Shetty)ప్రధాన వక్తగా పాల్గొన్నారు. శెట్టి తన ప్రసంగంలో పోలీసు సేవ యొక్క విలువలను, ఒక పోలీసు అధికారి వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా అభివృద్ధి చెందడం సమాజ అభివృద్ధికి ఎంత ముఖ్యమో వివరించారు. పోలీస్ ఉద్యోగం కేవలం చట్టాన్ని అమలు చేయడమే కాదు అది సమాజానికి సేవ చేయడం, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం, భద్రతను కాపాడడం వంటి గొప్ప బాధ్యతలను కలిగి ఉంటుంది అని ఆయన అన్నారు. అలాగే కమ్యూనికేషన్, టీమ్‌వర్క్, లీడర్‌షిప్, ఎమ్పతీ, టైమ్ మేనేజ్‌మెంట్ వంటి నైపుణ్యాలు ఒక సమర్థవంతమైన పోలీసు అధికారిని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ నైపుణ్యాలు కేవలం వృత్తిపరమైన పనితీరుని మెరుగుపరచడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలో సంతృప్తి, స్థిరత్వం తీసుకువస్తాయని ఆయన చెప్పిన మాటలు పోలీస్ ట్రైనీలను బాగా ఆకట్టుకున్నాయి.
సేవాస్ఫూర్తి, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం ఇవి పోలీసు ఉద్యోగంలో అత్యంత అవసరమైన మూల సూత్రాలు. ఒక పోలీస్ అధికారి తనలో మానవీయతను, సానుభూతిని పెంపొందించుకుంటే, ప్రజలతో విశ్వాసబంధం బలపడుతుంది అని శెట్టి జోడించారు. ఈ కార్యక్రమానికి ఎస్‌పి శ్రీ పి. మాధుకర్ స్వామి, డీఎస్పీ వెంకట విజయ్ కుమార్, సీఐ చంద్రశేఖర్ తదితర అధికారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పోలీస్ ట్రైనీలు ఈ శిక్షణ తమలో కొత్త ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపిందని తెలిపారు. ఈ సెషన్ ద్వారా మా వృత్తిపరమైన దృక్పథం మారింది. సమాజ సేవలో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడానికి ఇది మాకు ప్రేరణ ఇచ్చింది అని ట్రైనీలు తెలిపారు. కార్యక్రమం ముగింపులో ఈ. ఉరుకుందు శెట్టి ఈ శిక్షణ నిర్వహణలో సహకరించిన నీకీలూ గుండా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం పోలీసు సిబ్బందికి మానసిక ఉత్సాహం, సేవాస్ఫూర్తి, సమర్థతను పెంచే దిశగా ఒక విలువైన అంచెగా నిలిచింది. సమాజానికి భద్రత కల్పించే పోలీస్ సిబ్బంది మానసికంగా దృఢంగా, నైపుణ్యపరంగా సిద్ధంగా ఉండటానికి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మరింత అవసరమని అధికారులు అభిప్రాయపడ్డారు.
