Revanth Reddy: తెలంగాణ (Telangana) పట్టణాల రూపురేఖలను మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలక సంస్థల అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు కేటాయిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మొత్తం 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధి, రహదారుల విస్తరణ, పారిశుధ్య సదుపాయాల మెరుగుదల, నీటి సరఫరా ప్రాజెక్టులు వంటి పలు కార్యక్రమాల కోసం రూ. 2,780 కోట్ల నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నిధులతో మొత్తం 2,432 అభివృద్ధి పనులకు ఆమోదం లభించింది. ఇందులో ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, ఇటీవల గ్రామాలను విలీనం చేసుకున్న పట్టణ స్థానిక సంస్థలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడింది. ఈ ప్రాంతాల్లో మౌలిక వసతుల లోపం అధికంగా ఉండటంతో, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి పేర్కొంటూ ప్రతి పట్టణం సమగ్ర అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలి. మంజూరైన పనులకు తక్షణమే టెండర్ ప్రక్రియ ప్రారంభించి, ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలి. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి రూపాయి ప్రజా ప్రయోజనానికి వినియోగించాలి అని సూచించారు. ఈ క్రమంలో మున్సిపల్ పరిపాలనా శాఖ ఇప్పటికే నిధుల విడుదలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు సిద్ధం చేసింది. ప్రాజెక్టుల ప్రాధాన్య క్రమం, పట్టణాల జనాభా, మౌలిక వసతుల అవసరాలను పరిశీలించి నిధుల పంపిణీ జరగనుంది. నిధుల వినియోగంపై క్రమం తప్పని పర్యవేక్షణకు ప్రత్యేక మానిటరింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
‘తెలంగాణ రైజింగ్ విజన్ 2027’లో భాగంగా ఈ నిధుల కేటాయింపు కీలక భాగమని అధికారులు తెలిపారు. ఈ విజన్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్ది, సమగ్ర పట్టణ వృద్ధిని ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మిగిలిన పట్టణాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందేలా ఈ ప్రణాళిక రూపొందించబడిందని వారు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పెంపు, ప్రజా సేవల విస్తరణ, పరిశుభ్రత, పచ్చదనం వంటి అంశాలు మరింత వేగం పొందనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ పట్టణాభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
