Varanasi Movie : సూపర్ స్టార్ మహేశ్ బాబు(Superstar Mahesh Babu),ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ పై నిత్యం కొత్త అప్‌డేట్ బయటకు రావడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగీతదర్శకుడు ఎం.ఎం. కీరవాణి (Music director M.M. Keeravani)ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టడం చర్చనీయాంశమైంది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కార్యక్రమంలో పాల్గొన్న కీరవాణి మాట్లాడుతూ..వారణాసి చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉంటాయి. ఈ ఆల్బమ్ సాధారణంగా ప్రేక్షకులు ఊహించినదాన్ని మించి ఉంటుందనే నమ్మకం నాకు ఉంది. ప్రతి పాట ప్రత్యేకంగా నిలుస్తుంది. అభిమానులు తప్పకుండా ఇష్టపడతారు అని తెలిపారు.
ఆయన వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చిత్ర సంగీతంపై ఆసక్తి మరింత పెరిగింది. ఇకపోతే, ఈ చిత్రంలో కీలకమైన హనుమంతుడి పాత్రకు ఆర్. మాధవన్ ఎంపికయ్యారన్న వార్తలు ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. గతంలో ఆయన మహేశ్ బాబుకు తండ్రి పాత్ర చేయనున్నారని వచ్చిన రుమర్లు ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నాయి. మాధవన్ హనుమంతుడిగా కనబడతారనే ఈ తాజా సమాచారం అభిమానుల్లో కుతూహలం పెంచుతున్నప్పటికీ, ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో విడుదల చేసిన నాలుగు నిమిషాల గ్లింప్స్ చిత్రంపై అంచనాలను మరింత ఎత్తుకు చేర్చింది. పురాణ నేపథ్యాన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలతో మిళితం చేస్తూ రూపొందించిన విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ముఖ్యంగా త్రిశూలంతో మహేశ్ బాబు కనిపించిన సీన్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభించింది.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ..మహేశ్ రాముడి లుక్‌లో సెట్‌లోకి వచ్చిన క్షణం నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. ఆ వైభవం, ఆ ఎనర్జీ మాటల్లో వర్ణించలేనిది అని తన అనుభూతిని వెల్లడించారు. ఈ యాక్షన్–అడ్వెంచర్ చిత్రంలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ‘మందాకిని’, కాగా ప్రతినాయకుడిగా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ‘కుంభ’ పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, విస్తృత నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ మాగ్నమ్ ఓపస్‌ను 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘వారణాసి’పై ప్రతి అప్‌డేట్ బయటకు వచ్చినప్పుడల్లా సినిమా అభిమానులను మాత్రమే కాదు, మొత్తం భారత సినీ పరిశ్రమను కూడా ఉత్సాహపరుస్తున్న విషయం ప్రత్యేకం.
