Manchu Manoj: విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన మంచు మనోజ్ (Manchu Manoj) ఇప్పుడు తన కళా ప్రయాణంలో మరో కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. నటనతో పాటు సంగీతంపై అతనికి ఉన్న అపారమైన ఆసక్తి తెలిసిందే. ఆ ప్రేమను ఇక అధికారికంగా రూపుదిద్దుతూ ‘మోహన రాగ మ్యూజిక్’ (Mohana Raga Music) అనే కొత్త సంగీత సంస్థను ప్రారంభిస్తున్నట్లు మనోజ్ ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా కొత్త సంగీత ప్రతిభకు వేదికగా నిలబెట్టాలని, ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఆయన వెల్లడించారు. మనోజ్‌కు సంగీతంతో ఉన్న అనుబంధం చాలా కాలం నాటిది. సినిమా ఇండస్ట్రీలో నటుడిగానే కాకుండా, గాయకుడిగా మరియు గేయ రచయితగా కూడా తన ముద్ర వేసిన అరుదైన స్టార్లలో మనోజ్ ఒకరు. ‘పోటుగాడు’ చిత్రంలోని ‘ప్యార్ మే పడిపోయానే’ పాటను ఆయన స్వయంగా పాడగా, ఆ పాట భారీ హిట్ అయ్యింది.
అదేవిధంగా ‘మిస్టర్ నూకయ్య’, ‘నేను మీకు తెలుసా’ వంటి సినిమాలకు పాటలు రాసి తన బహుముఖ ప్రతిభను చూపించారు. తన కుటుంబ నిర్మాణ సంస్థల్లో వచ్చే చిత్రాలకు సంగీత విభాగంలో ఆయన చేసిన సృజనాత్మక సహకారం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాత్రమే కాకుండా, మనోజ్ అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో కూడా భాగమైన సంగతి చాలామందికి తెలియదు. హాలీవుడ్ చిత్రం ‘బాస్మతి బ్లూస్’ కోసం ప్రముఖ సంగీత దర్శకుడు అచ్చు రాజమణితో కలిసి పనిచేయడం ఆయన సంగీతాభిరుచి, వైవిధ్యాన్ని మళ్లీ నిరూపించింది. కొత్తగా ప్రారంభిస్తున్న ‘మోహన రాగ మ్యూజిక్’ పేరుకు కూడా ఓ భావోద్వేగ నేపథ్యం ఉందని మనోజ్ తెలిపారు.
తనను అత్యంత ప్రభావితం చేసిన భారతీయ శాస్త్రీయ సంగీత రాగాలలో ఒకటైన మోహన రాగం, అలాగే తన తండ్రి నటశేఖర డా. మోహన్ బాబు గారి పేరు కలయికగా ఈ పేరును నిర్ణయించారని తెలిపారు. భారతీయ సంగీత సౌందర్యాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లడం, కొత్త ఆలోచనలకు వేదిక కల్పించడం, నిజమైన ఒరిజినల్ మ్యూజిక్‌కి ప్రోత్సాహం ఇవ్వడం ఇవే ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. ‘మోహన రాగ మ్యూజిక్’ బ్యానర్ ద్వారా త్వరలోనే ఒరిజినల్ సింగిల్స్, వినూత్న సంగీత ప్రయోగాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంతేకాకుండా, ఒక భారీ అంతర్జాతీయ సంగీత ప్రాజెక్ట్‌ను కూడా త్వరలో ప్రకటిస్తామని మనోజ్ స్పష్టం చేశారు. తన కళా ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన మనోజ్, నటుడిగానే కాకుండా సంగీత సృష్టికర్తగా కూడా తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. తెలుగు సంగీత రంగంలో ఓ కొత్త శక్తిగా మారబోతున్న ఈ ప్రయత్నంపై ఇప్పటికే అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
