TTD: యాంకర్ శివ జ్యోతి(Shiva Jyothi)పై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న తాజా నిర్ణయం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం(Srivari Laddu Prasadam)పై ఆమె తమ్ముడు చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన విమర్శలకు దారితీసిన నేపథ్యంలో, టీటీడీ ఆమె తిరుమల దర్శనం నిషేధించే చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఆమె ఆధార్ వివరాలను సిస్టమ్‌లో బ్లాక్ చేసినట్టు సమాచారం ఇంకా అధికారిక ధృవీకరణ మాత్రం వెలువడలేదు. ఇటీవల శివ జ్యోతి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వేగంగా వైరల్ అయ్యింది. అందులో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉండటంతో భక్తులు తీవ్రంగా స్పందించారు.
శ్రీవారి ప్రసాదం పట్ల అవమానకరంగా వ్యవహరించారన్న విమర్శలు సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యాపించాయి. భక్తుల ఆందోళనలను పరిగణలోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ విభాగం ఈ సంఘటనపై అంతర్గత విచారణ ప్రారంభించింది. విచారణ అనంతరం జరిగిన బోర్డు సమావేశంలో, శివ జ్యోతి తిరుమల దర్శనం కోసం టికెట్లు పొందకుండా నిరోధించే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సంఘటన మరింత పెద్దదిగా మారుతుండటంతో, శివ జ్యోతి స్వయంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. “మా తమ్ముడు చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే హృదయపూర్వక క్షమాపణలు. మా కుటుంబం శ్రీవారిపై ఎప్పటికీ విశ్వాసం, భక్తి కలిగినదే” అని ఆమె పేర్కొన్నారు. ఆమె స్పష్టమైన క్షమాపణలు తెలిపినా, భక్తుల్లో కొనసాగుతున్న ఆగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ మరింత కఠినంగా స్పందించినట్లు తెలుస్తోంది.
టీటీడీ అధికారులు కూడా ఇటీవల జరిగిన సమావేశాల్లో, శ్రీవారి ప్రసాదం, ఆలయ సంప్రదాయాలు, విధానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై నిబంధనల ప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుమల దేవస్థాన పరిరక్షణ కోసం భక్తుల భావాలు అత్యంత ముఖ్యమని, అలాంటి భావాలను దెబ్బతీయడాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశమే లేదని వారు తెలిపారు. ఈ ఘటనతో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు టీటీడీ చర్యలను సమర్థిస్తుండగా, మరికొందరు శివ జ్యోతి నేరుగా వ్యాఖ్యానం చేయకపోయినా ఆమెపై చర్యలు తీసుకోవడం అతిశయోక్తి అని విమర్శిస్తున్నారు. టీటీడీ అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వివాదం ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
