Rashmika: నటి రష్మిక మందన్నా(Actress Rashmika Mandanna),విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda)జంట ఫిబ్రవరిలో వివాహం చేసుకోనున్నారనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై అభిమానుల్లో కూడానూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఒక హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఈ రూమర్స్‌పై తన స్పందన తెలియజేశారు. ఈ ప్రచారంలో వస్తున్న వార్తలను నేను ఇప్పుడే ధ్రువీకరించాలనో, లేదంటే ఖండించాలనో కూడా అనిపించడం లేదు. అసలు పెళ్లి విషయానికి వస్తే ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అప్పుడు చెప్తాను. మీ అందరితో సమయంలో పంచుకుంటాను. ప్రస్తుతం దాని కంటే ఎక్కువ సమాచారం వెల్లడించే యోచన లేదు అని రష్మిక స్పష్టంచేశారు.
వ్యక్తిగత విషయాలను ప్రేక్షకుల ముందుంచడంపై రష్మిక తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. నా పర్సనల్ లైఫ్ గురించి బహిరంగంగా చెప్పడం నాకు నచ్చదు. వ్యక్తిగత జీవితాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటాను. ఇంట్లో ఉండగా వర్క్ గురించి మాట్లాడను. పని విషయంలో బయట ఉన్నప్పుడు మాత్రం పర్సనల్ విషయాలను మరిచిపోతాను. ప్రతి పనికీ ఒక ప్లాన్ ఉంటుంది. సినిమాల సంగతికొస్తే, మనం అనుకున్నట్టుగా అన్ని సమయాల్లో జరగవు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల షూటింగ్‌లు వాయిదా పడతాయి. మీటింగ్స్, రిహార్సల్స్ కారణంగా కొన్ని సార్లు షూట్ ఆలస్యమవుతుంది. డబుల్ షిఫ్ట్‌లు చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. నటీనటులు ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉండాల్సిందే. ఇదిలా ఉంటే నాకు నరుటో అనిమే అంటే చాలా ఇష్టం. దానిని చూస్తూ నాకొక రకమైన రిలీఫ్ లభిస్తుంది అని ఆమె చెప్పుకొచ్చారు.
ఇదే ఇంటర్వ్యూలో రష్మిక తన కెరీర్ ప్రయాణం, ఈ ఏడాది సాధించిన విజయాల గురించి కూడా ప్రస్తావించారు. ఈ ఏడాది నా జీవితంలో ప్రత్యేకమైనది. వరుసగా ఐదు సినిమాలు విడుదలై ప్రేక్షకుల ప్రేమను అందుకున్నాయి. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడాలి. విజయాలు ఒక్క రోజులో రావు. ప్రేక్షకులు నన్ను అన్ని రకాల పాత్రల్లోనూ అంగీకరించడానికి కొంత సమయం పట్టింది. ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన రోజులలోనే భాష, జానర్ అంటూ ఎలాంటి గీతలు వేయకుండా అన్ని రకాల కథల్లో నటించాలని నిర్ణయించుకున్నాను. ఈ ఏడాదిలో వచ్చిన ఐదు సినిమాల్లో ప్రతి పాత్ర వేర్వేరు నెయివిటీతో ఉంటాయి. వాటిని చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తుండటం నాకు పెద్ద ఆనందాన్ని ఇస్తోంది అని రష్మిక తెలిపారు. ఈ ఇంటర్వ్యూ మొత్తంలో రష్మిక తన వ్యక్తిగత జీవితం, కెరీర్ పై ఉన్న ఆలోచనల్ని స్పష్టంగా వెల్లడించడమే కాకుండా, ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా పనిపైనే ఉందని కూడా తెలియజేశారు.
