Akhanda 2 Release Date: నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘అఖండ 2’(Akhanda 2) గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఆర్థిక సంబంధిత ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడ్డ ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందన్న ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(Producer Tammareddy Bharadwaja) ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. ఆయన మాటల ప్రకారం, సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
తాజా పరిస్థితులను వివరిస్తూ తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఈ ఏడాది రెండు పెద్ద సినిమాలు ‘హరిహరవీరమల్లు’, ‘అఖండ 2’—రిలీజ్ విషయాల్లో ఆర్థికపరమైన అడ్డంకులు చూశాయి. నిర్మాతలు గతంలో చేసిన కొన్ని ఫైనాన్షియల్ కమిట్‌మెంట్‌లు కారణంగా ఇవి తలెత్తాయి. ‘హరిహరవీరమల్లు’ సమస్యలు తొలగిన వెంటనే విడుదల అయ్యింది. ఇప్పుడు అదే విధంగా ‘అఖండ 2’ ఇష్యూ కూడా పూర్తిగా క్లియర్ అయింది. నా అంచనాలో డిసెంబర్ 12 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలుసు అందుకే టీమ్ సాధ్యమైనంత త్వరగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అని అన్నారు. అలాగే సినిమా వాయిదాలు వసూళ్లపై ఎంతవరకు ప్రభావం చూపుతాయన్నదానిపై ఆయన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు.
రీలీజ్ డేట్ మారిందని సినిమా ఫలితం మారదు. ప్రేక్షకుల్లో ఒక ఆసక్తి, అంచనా ఉంటాయి. ఆలస్యమైతే కొద్దిగా రెవెన్యూ లో తేడా ఉండొచ్చు అదీ పెద్దగా కాదు, సుమారు 3 నుంచి 4 కోట్లు వరకు మాత్రమే. పెద్ద సినిమాలకు మొదటి మూడు రోజుల్లో వచ్చే కలెక్షన్‌దే అసలు బలం. కంటెంట్ బాగున్నా, అనుకున్నంతగా లేకపోయినా, ఆ మూడు రోజుల్లోనే పెద్ద భాగం రాబడి వస్తుంది అని చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ 2’ ను అసలు డిసెంబర్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో వచ్చిన ఆర్థిక సమస్యలు కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం సమస్యలు పరిష్కారమవడంతో మళ్లీ విడుదల తేదీ ఖరారుపై చర్చలు చురుగ్గా జరుగుతున్నాయి. సినిమా టీమ్ అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నప్పటికీ, తమ్మారెడ్డి వెల్లడించిన సమాచారం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, డిసెంబర్ 12న ‘అఖండ 2’ థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.
