Hyderabad : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao)మళ్లీ ధాటిగా దుయ్యబట్టారు. తాజాగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ (Global Summit)పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ఖజానా నుండి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలకు ఏ మాత్రం మేలుచేయలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వమే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసినప్పటికీ, ఫలితాలు మాత్రం లేవని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్పై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్ధేశం చేయాల్సిన డాక్యుమెంట్‌లో స్పష్టత లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ, “విజన్ లేకపోతే దాన్ని ఎలా విజన్ డాక్యుమెంట్ అంటారు? ఇది అసలు విజన్‌లెస్ పేపర్” అని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి ఇచ్చే నినాదాలను ఉద్దేశిస్తూ, “క్యూర్, ప్యూర్, రేర్ అంటున్న సీఎం… కానీ తెలంగాణను దోచుకుంటున్న చోర్” అంటూ హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో కుదుర్చుకున్న ఎంఓయూల వెనుక పారదర్శకత లేదని, దాగుడుమూతలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. అంకెలతో ప్రజలను మభ్యపెట్టడమే తప్ప, వాస్తవ ప్రయోజనం శూన్యమని మండిపడ్డారు. గత రెండేళ్లలో సీఎం చేసిన విదేశీ పర్యటనలు, సమ్మిట్‌ల ద్వారా రాష్ట్రానికి ఎంతమేర పెట్టుబడులు వచ్చాయో ప్రభుత్వమే స్పష్టంగా చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాగితాల మీద ఎంఓయూలు కుదుర్చుకోవడం ఒకటైతే, ఆ కంపెనీలు ప్రాజెక్టులను ప్రారంభించడం మరోకటి అన్నారు. పెట్టుబడులు వచ్చాయని చెప్పుకుంటే, వాటి ఆధారాలను, యువతకు కల్పించిన ఉద్యోగాల వివరాలను శ్వేతపత్రం రూపంలో విడుదల చేయాలని ఆయన ప్రభుత్వం సవాల్ విసిరారు.
కేసీఆర్ ప్రభుత్వ కాలంలో తీసుకున్న అభివృద్ధి చర్యలను అంతర్జాతీయ వేదికలపై కూడా గుర్తించి అభినందనలు అందుకున్నామని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలంగాణ ప్రగతిని ప్రశంసించారని, ఆ మాటలు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యానికి బలమైన చెంపపెట్టు వంటివని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రచార రాజకీయం మాత్రమే చేస్తోందని, ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను పక్కనబెట్టిందని ఆయన ఆరోపించారు. సమ్మిట్‌ల పేరుతో, పర్యటనల పేరుతో ఖర్చు చేసే ధనం నిజమైన ఫలితాల రూపంలో కనిపించకపోతే, ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తప్పక ప్రశ్నిస్తారని హెచ్చరించారు.
