Hyderabad : హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణను అందుకోబోతోంది. నగర శివార్లలోని కొత్వాల్‌గూడ(Kotwalguda) ప్రాంతంలో రూ.300 కోట్ల వ్యయంతో అద్భుతమైన టన్నెల్ అక్వేరియం (Tunnel Aquarium)నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం–ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP మోడల్) అమలు కానున్న ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక, దేశంలోనే అత్యంత భారీ పబ్లిక్ అక్వేరియంగా నిలువనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మల్టీవర్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్, పోలిన్ అక్వేరియమ్స్, కాడోల్ గ్రూప్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అక్వేరియం కోసం అవసరమైన భూమిని, అనుమతులను వేగంగా అందజేయనుంది. టెక్నికల్ డిజైన్ మరియు జలచరాల సంరక్షణ అంశాలను పోలిన్ అక్వేరియమ్స్ పర్యవేక్షిస్తుండగా, మల్టీవర్స్ హోటల్స్ మరియు కాడోల్ గ్రూప్ హాస్‌పిటాలిటీ, మౌలిక వసతులు, సందర్శకుల అనుభవం వంటి విభాగాలను చూసుకోనున్నాయి.
ప్రాజెక్టు మొత్తం 1,75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. హైదరాబాద్ యొక్క సంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబించేలా అక్వేరియం డిజైన్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో 100 మీటర్ల పొడవైన టన్నెల్, గాజు గోడల వెంట ఈదే సముద్రజీవులతో ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. అలాగే 30 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న భారీ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉంది. ఈ ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా ಒకేసారి 3,000 మంది సందర్శకులు ప్రవేశించి పరిశీలించేలా ప్రత్యేక మార్గాలు, సౌకర్యాలు అమలు చేయనున్నారు. టన్నెల్ గుండా నడుస్తూ వివిధ రకాల సముద్ర జీవులను దగ్గరగా చూడగల అవకాశాన్ని సందర్శకులు పొందనున్నారు.
ఇక్కడ ప్రదర్శనకు ఉంచబోయే జలచరాల సంఖ్య కూడా విశేషం. మొత్తం 300 జాతులకు చెందిన సుమారు 10,000 జలచరాలు అక్వేరియంలో ఉండనున్నాయి. వాటిలో అరుదైన జాతులు, రంగురంగుల ట్రాపికల్ చేపలు, పెద్ద పరిమాణంలో ఉండే సముద్ర జీవులు, ముత్యాల రీఫ్‌లాంటి ప్రత్యేక మోడల్స్ కూడా ఉంటాయి. సందర్శకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి అండర్ వాటర్ రెస్టారెంట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సముద్రజీవుల నడుమ భోజనం చేసే అనుభూతి పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారనుంది. ప్రస్తుతం నిర్మాణానికి సంబంధించిన భూమి స్వాధీనం, రూపకల్పన, ఇంజినీరింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. అన్ని పనులు ప్రణాళిక ప్రకారం జరిగితే, వచ్చే ఏడాది చివరికల్లా ఈ అద్భుతమైన టన్నెల్ అక్వేరియం ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ పర్యాటక రంగానికి మరో మైలురాయిగా నిలిచే ఈ అక్వేరియం, నగర అంతర్జాతీయ గుర్తింపును మరింత పెంచే అవకాశం ఉంది.
