Indigo: దేశీయ విమానయాన రంగంలో సంచలనంగా మారిన ఇండిగో సంక్షోభం(Indigo crisis)పై పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) (DGCA)దృఢమైన చర్యలు ప్రారంభించింది. భద్రతా ప్రమాణాల పర్యవేక్షణలో అలక్ష్యం చూపిన నాలుగు ఫ్లైట్ ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి తప్పిస్తూ డీజీసీఏ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. ఇటీవల నెల రోజులుగా ఇండిగోలో ఏర్పడిన నిర్వహణ లోపాలు, భద్రతా నియమావళి పాటించకపోవడం వల్ల భారీ సంఖ్యలో విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. ఇండిగోలో చోటుచేసుకున్న విమానాల రద్దులు, ఆలస్యాలు దేశవ్యాప్తంగా ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలను అస్తవ్యస్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ ఇప్పటికే ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను వివరణకు పిలిపించింది. ఆయన ఈరోజు మరోసారి అధికారుల సమక్షంలో హాజరు కానున్నారు.
విమాన భద్రత, పర్యవేక్షణ సంబంధిత అంశాల్లో ఇన్‌స్పెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పరిశీలనలో తేలడంతో, వారిపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని డీజీసీఏ వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే సంక్షోభం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు డీజీసీఏ రెండు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయం నుంచి రోజువారీ కార్యకలాపాలను నిశితంగా గమనించనున్నాయి. విమానాల లభ్యత, పైలట్టుల డ్యూటీ అవర్స్, సిబ్బంది కేటాయింపు, ప్రయాణికులకు రీఫండ్‌లు, పరిహారం వంటి కీలక అంశాలపై ఈ బృందాలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలలోపు నివేదికలను సమర్పించాలి. ఇందువల్ల సంక్షోభ కారణాలపై సమాచారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ఇండిగో తన షెడ్యూల్డ్ సర్వీసులను తాత్కాలికంగా 10 శాతం తగ్గించాలని డీజీసీఏ ఆదేశించింది. ఫలితంగా రోజూ నడిచే 2,200 విమానాల్లో దాదాపు 200 విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నప్పటికీ, తక్షణ ఉపయోగదారులు కొంత అసౌకర్యాన్ని ఎదిరించే అవకాశం ఉంది. ఇండిగో నిర్వహణ వైఫల్యం వల్ల ప్రయాణికులు ఆపన్నహస్తంగా నిలవలేకపోయారని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణ ఛార్జీల నియంత్రణ, రద్దయిన విమానాల రీఫండ్‌లు, ప్రయాణికులకు తక్షణ సాయం వంటి అన్ని ఆదేశాలును కచ్చితంగా అమలు చేయాలని ఇండిగో యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో ఈ నెల 3 నుండి 5 వరకు తీవ్రమైన ఆలస్యాలు ఎదుర్కొన్న ప్రయాణికులకు తగిన పరిహారం అందిస్తామని ఇండిగో ప్రకటించడం కొంత ఊరటనిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు డీజీసీఏ మరింత కఠిన పర్యవేక్షణను అమలు చేయాలని సంకేతం ఇస్తోంది. ఈ చర్యలు ఇండిగో కార్యకలాపాల్లో మార్పులు తీసుకురావడంలో ఎంతవరకు ప్రభావం చూపుతాయో మరికొన్ని రోజుల్లో స్పష్టమవుతుంది.
