end
=
Saturday, December 20, 2025
వార్తలురాష్ట్రీయంతెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌..డీజీపీ ఎదుట 40 మంది లొంగుబాటు
- Advertisment -

తెలంగాణలో మావోయిస్టు పార్టీకి భారీ షాక్‌..డీజీపీ ఎదుట 40 మంది లొంగుబాటు

- Advertisment -
- Advertisment -

Telangana: తెలంగాణలో మావోయిస్టు పార్టీ(Maoist Party)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుమారు నలభై మంది మావోయిస్టులు ఈరోజు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) ఎదుట లొంగిపోవడం రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లొంగిపోయిన వారిలో రాష్ట్ర స్థాయి కీలక నేతలు ముగ్గురు ఉండటంతో పాటు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టులు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమానికి తీవ్ర నష్టాన్ని కలిగించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లొంగుబాటు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు డీజీపీ శివధర్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టి, వారు ఆయుధ పోరాటానికి దూరమవడానికి గల కారణాలు, ప్రభుత్వ విధానాల ప్రభావం వంటి అంశాలపై వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. అలాగే, పునరావాసం, భద్రత, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ కగార్” మావోయిస్టులపై ఒత్తిడి పెంచిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికే లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలో ప్రకటించారు. ఈ చర్యలలో భాగంగా భద్రతా బలగాలు ముమ్మరంగా ఆపరేషన్లు చేపట్టడంతో, పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు తగ్గినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా అగ్ర నాయకత్వం క్రమంగా దెబ్బతినడం, కమ్యూనికేషన్ వ్యవస్థలు బలహీనపడటం, ప్రజల్లో మద్దతు తగ్గడం వంటి కారణాలతో మావోయిస్టు పార్టీ అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఫలితంగా, అడవుల్లో కొనసాగుతున్న జీవితం కన్నా సాధారణ జీవన విధానాన్ని ఎంచుకోవాలనే ఆలోచనకు పలువురు క్యాడర్ వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం పార్టీకి కోలుకోలేని నష్టంగా భావిస్తున్నారు. ఇది ఇతర ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని, భవిష్యత్తులో మరిన్ని లొంగుబాట్లు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -