AP Government: గ్రామీణ ప్రజలకు సంక్రాంతి పండు(Sankranti festival)గను మరింత ఆనందంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. పేదలు, కూలీలు, వలస కార్మికులకు తక్కువ ధరలో పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న అన్న క్యాంటీన్ల నిర్మాణ పనులను జనవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తయితే జనవరి 13 నుంచి 15వ తేదీల మధ్య ఈ క్యాంటీన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. సంక్రాంతి పండుగ వేళ గ్రామీణ ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభమైతే ప్రజలకు పెద్ద ఊరటగా మారనున్నాయి.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణాలు, నగరాల్లో ఇప్పటికే 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తోంది. ఈ క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తున్నారు. ఒక్కో పూటకు కేవలం రూ.5కే భోజనం అందించడం వల్ల రోజుకు 2 లక్షల మందికిపైగా ప్రజలు లబ్ధి పొందుతున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఆహారం అందడంతో అన్న క్యాంటీన్లు ప్రజల విశేష ఆదరణను పొందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే తరహా సేవలు అందించాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం మరో 70 అన్న క్యాంటీన్లకు అనుమతి ఇచ్చింది. వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదలు, వృద్ధులు, నిరుద్యోగులు ఈ సేవల ద్వారా నేరుగా లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా పనుల కోసం మండల కేంద్రాలకు వచ్చే వారికి ఈ క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడనున్నాయి.
పట్టణ, నగర ప్రాంతాల్లో కొనసాగుతున్న 205 అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించారు. వీరిలో 3.16 కోట్ల మంది మధ్యాహ్న భోజనం చేయగా, 2.62 కోట్ల మంది ఉదయం అల్పాహారం, 1.42 కోట్ల మంది రాత్రి అల్పాహారం పొందారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అన్న క్యాంటీన్లకు అత్యధిక స్పందన లభించడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాలకు ఈ పథకం విస్తరించడం ద్వారా ఆహార భద్రత మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. పండుగ కానుకగా ప్రారంభమయ్యే ఈ అన్న క్యాంటీన్లు గ్రామీణ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
