end
=
Wednesday, December 24, 2025
వార్తలుజాతీయంరాజకీయాల్లో కొత్త మలుపు: మాజీ మావోయిస్టులతో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సంకేతాలు
- Advertisment -

రాజకీయాల్లో కొత్త మలుపు: మాజీ మావోయిస్టులతో రాజకీయ పార్టీ ఆవిర్భావానికి సంకేతాలు

- Advertisment -
- Advertisment -

Mallojula Venugopal: దేశ రాజకీయాల్లో మరో కీలక మార్పు దశకు అడుగులు పడుతున్నాయా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సాయుధ పోరాటానికి వీడ్కోలు పలికిన మాజీ మావోయిస్టు (Former Maoist)నేతలు మల్లోజుల వేణుగోపాల్(Mallojula Venugopal) అలియాస్ సోనూ, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న నాయకత్వంలో త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీ ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ పార్టీ పూర్తిగా భారత రాజ్యాంగ పరిధిలోనే పనిచేస్తుందని, ప్రజాస్వామ్య మార్గంలోనే ముందుకు సాగుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఆశన్న ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మళ్లీ ఆయుధాల మార్గంలోకి వెళ్లే ప్రశ్నే లేదని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.

రాజకీయాల ద్వారా సామాజిక మార్పు సాధించాలనే దిశగా ఆలోచనలు కొనసాగుతున్నాయని కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు కొత్త పార్టీ ఏర్పాటుపై ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. గత ఏడాది అక్టోబర్ నెలలో సోనూ 60 మంది, ఆశన్న 210 మంది మావోయిస్టు కేడర్లతో కలిసి ఆయుధాలతో లొంగిపోవడం అప్పట్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా వివిధ రాష్ట్రాల్లో లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ డీజీపీ సమక్షంలో 41 మంది నక్సలైట్లు 24 ఆయుధాలతో లొంగిపోవడం మరో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఇది సాయుధ ఉద్యమం నుంచి రాజకీయ, సామాజిక ప్రవాహం వైపు మార్పుకు సంకేతంగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంటెలిజెన్స్ వర్గాల అంచనాల ప్రకారం ఇప్పటివరకు 600 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ప్రస్తుతం మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ కేంద్రాల్లో ఉన్నారు. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు పూర్తయ్యాక వీరిని సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి పునరావాస చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం 2026 ఏప్రిల్ లేదా మే నెలల్లో ఈ కొత్త పార్టీ అధికారికంగా ఆవిర్భవించే అవకాశం ఉంది. అయితే పార్టీ పేరు ఏమిటి? అందులో మావోయిస్టు లేదా కమ్యూనిస్టు వంటి పదాలు ఉంటాయా? ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తుందా? వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయినప్పటికీ, సాయుధ పోరాటాన్ని వీడి ప్రజాస్వామ్య రాజకీయాల వైపు అడుగులు వేయడం దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -