Amit Shah: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుతోంది (Muslim population growth), దీనికి మూలకారణం అక్రమ చొరబాట్లే(illegal immigration)నని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని, దీని ప్రభావం దేశ భద్రతపైనా, ప్రజాస్వామ్య పునాది విలువలపైనా తీవ్రమైనదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా జరిగిన ‘నరేంద్ర మోహన్ స్మారకోపన్యాసం’లో పాల్గొన్న అమిత్ షా, ఈ వ్యాఖ్యలు చేస్తూ దేశంలోని జనాభా గణాంకాలను ప్రస్తావించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, అస్సాంలో ముస్లిం జనాభా గత పదేళ్లలో 29.6 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. “ఇంత విస్తృతంగా జనాభా పెరుగుదల సాధ్యపడాలంటే, దాని వెనుక చొరబాట్ల ముప్పే ఉందని గుర్తించాల్సిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.
అదే విధంగా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని జిల్లాల్లో ముస్లిం జనాభా వృద్ధి రేటు 40 శాతం దాటి ఉందని, సరిహద్దు ప్రాంతాల్లో ఇది ఏకంగా 70 శాతానికి చేరిందని ఆయన వివరించారు. “ఇవి సామాన్య జనాభా మార్పులు కావు. ఇవి గతంలో జరిగిన అక్రమ చొరబాట్లకు ప్రత్యక్ష సాక్ష్యాలు,” అని అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతేగాక, కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. “గుజరాత్, రాజస్థాన్‌లకు కూడా అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. కానీ అక్కడ మసలకుండా చొరబాట్లు ఎందుకు జరగడం లేదు? అనే ప్రశ్నను ప్రతిపక్షాలు తలచుకోవాలి,” అని అన్నారు.
చొరబాట్లను అరికట్టడం కేవలం కేంద్ర ప్రభుత్వమో, బీఎస్‌ఎఫ్‌దో మాత్రమే కాదు. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాల భాగస్వామ్యం తప్పనిసరి అని హోం మంత్రి పేర్కొన్నారు. అన్ని సరిహద్దుల్లో కంచె వేసే భౌగోళిక అవకాశం లేనందున, రాష్ట్రాల సహకారమే కీలకమని అన్నారు. ఇక, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారుల కారణంగా, జార్ఖండ్‌లో ఆదివాసీ జనాభా గణనీయంగా తగ్గుతోందని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రతి జిల్లాలోని యంత్రాంగం ఈ చొరబాట్లను గుర్తించడంలో విఫలమైతే, భద్రతకు ముప్పు తప్పదు,” అని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రేపుతున్న నేపథ్యంలో, అక్రమ చొరబాట్లపై మరింత చర్చకు దారి తీయనున్నాయి.