Penugonda: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District)లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగొండ (Penugonda)పేరును ఇకపై ‘వాసవీ పెనుగొండ’(Vasavi Penugonda)గా మార్చాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆర్యవైశ్య సమాజం నుండి వచ్చిన చిరకాల విజ్ఞప్తికి ప్రతిస్పందనగా తీసుకున్నదని ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు (జీవో) విడుదల కానున్నాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, సామాజిక న్యాయ శాఖ మంత్రి సవితతో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ రాకేష్ నేతృత్వంలోని ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పెనుగొండ గ్రామానికి ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని వివరించి, కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పేరు ‘వాసవీ పెనుగొండ’ గా మారాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతినిధుల వినతిని శ్రద్ధగా విన్న మంత్రి సవిత, వారి భావాలను గౌరవిస్తూ అక్కడిక్కడే అధికారిక ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ..కన్యకా పరమేశ్వరి అమ్మవారి పట్ల ఆర్యవైశ్యులకున్న భక్తి, గౌరవం అపారమైనది. వారి మనోభావాలను ప్రతిబింబించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెనుగొండ గ్రామానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు సాంస్కృతిక విలువ కూడా ఉంది. అందుకే దీనికి ‘వాసవీ’ అనే పేరు జతచేయడం సముచితం అని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సామాజిక సమానత్వం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఆర్యవైశ్యుల సమాజం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది. వారి ఆధ్యాత్మిక భావజాలాన్ని గౌరవించడం మన బాధ్యత అని అన్నారు.
ఈ నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అనేక సంఘ నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పేరు మార్పు ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ..వాసవీ అమ్మవారు శాంతి, త్యాగం, ధర్మానికి చిహ్నం. ఆమె పేరు పెనుగొండకు జతచేయడం ద్వారా ఈ పుణ్యక్షేత్రం మరింత మహాత్మ్యాన్ని పొందుతుంది అని అభిప్రాయపడ్డారు. ఇక,పై అధికారికంగా ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత ‘వాసవీ పెనుగొండ’ అనే పేరుతో అన్ని పత్రాలు, బోర్డులు, పర్యాటక సమాచారం నవీకరించబడనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో పెనుగొండ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలుకానుంది. ఆధ్యాత్మికత, చరిత్ర, భక్తి మూడు రంగాలను సమన్వయపరచిన ఈ పేరు మార్పు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

