end
=
Saturday, November 15, 2025
వార్తలురాష్ట్రీయందేశానికి గేట్‌వేలా ఆంధ్రప్రదేశ్‌ : సీఎం చంద్రబాబు
- Advertisment -

దేశానికి గేట్‌వేలా ఆంధ్రప్రదేశ్‌ : సీఎం చంద్రబాబు

- Advertisment -
- Advertisment -

Chandrababu: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకురావడంలో విశాఖపట్నం (Visakhapatnam) కీలక కేంద్రంగా మారిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit)లో ఆయన ప్రసంగిస్తూ, దేశంలోని అత్యంత అందమైన నగరంగా విశాఖ పేరొందడం రాష్ట్ర గౌరవాన్ని మరింత పెంచిందన్నారు. ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు హాజరుకావడం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు. ఇటీవ‌ల విశాఖను అత్యంత సురక్షిత నగరంగా కేంద్రం ప్రకటించిందని గుర్తుచేసిన సీఎం దేశానికి గేట్‌వేలా మారుతున్న ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడిదారులు దృష్టిపెట్టే ముఖ్య గమ్యస్థానంగా ఎదుగుతోంది అని అన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని పరిపాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసం, దేశాభివృద్ధికి బలమైన పునాది వేస్తోందని అభిప్రాయపడ్డారు. 2047 నాటికి ప్రపంచంలో అగ్రస్థాన ఆర్థికవేత్తగా భారత్‌ నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మన దగ్గర ఉన్న ప్రతిభ, సహజ వనరులు, సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే ఏ లక్ష్యాన్నైనా చేరవచ్చు. భారతీయ ఐటీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా తమ సత్తా చాటుతున్నారు. ఈ విజయాల్లో ఆంధ్రప్రదేశ్‌ యువత కూడా కీలక పాత్ర పోషిస్తోంది అని చంద్రబాబు అన్నారు. ప్రపంచ దృష్టి ఇప్పుడు భారత్‌పై నిలిచిపోయిందని, పేదరికం నివారణ, సామాజిక అసమానతలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్గాల్లో కృషి చేస్తోందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ వినియోగం పెంపు, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్‌ వేగంగా ముందుకు సాగుతుందని చెప్పారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని సాధించడానికి మౌలిక సదుపాయాల మెరుగుదల, పరిశ్రమల విస్తరణ, శుద్ధమైన శక్తి వినియోగం కీలకంగా మారుతున్నాయని వివరించారు.

ఏపీ అభివృద్ధికి సంబంధించి అనేక కొత్త ప్రాజెక్టులను సీఎం ప్రస్తావించారు. ప్రముఖ పరిశ్రమల కోసం స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ లాంటి కీలక పారిశ్రామిక వర్గాలు రాష్ట్రంలో వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉంది అని అన్నారు. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని, ఇది ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చూపిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ మరింత పెట్టుబడులను ఆకర్షించి, యువతకు వేలాది ఉద్యోగావకాశాలు సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది” అంటూ సీఎం తన ప్రసంగం ముగించారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -