end
=
Wednesday, November 26, 2025
వార్తలుజాతీయంభారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం.. ‘ఐఎన్‌ఎస్‌ మాహె’ విశేషాలివి..!
- Advertisment -

భారత అమ్ముల పొదిలోకి మరో అస్త్రం.. ‘ఐఎన్‌ఎస్‌ మాహె’ విశేషాలివి..!

- Advertisment -
- Advertisment -

MAHE : భారత రక్షణ రంగంలో (Indian Airforce) మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. దేశీయ సాంకేతికతతో పూర్తిగా నిర్మించిన తొలి యాంటీ సబ్‌మెరైన్ వార్‌షిప్ ‘ఐఎన్‌ఎస్ మాహె’ (MAHE) ఇవాళ అధికారికంగా భారత నౌకాదళంలో చేరింది. ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో ఈ నౌక హ్యాండోవర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ (Krishna Swaminathan)పాల్గొని నౌకను నౌకాదళ వినియోగానికి అంకితం చేశారు. దేశంలోనే తొలిసారి పూర్తిగా స్వదేశీ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ అడ్వాన్స్‌డ్ యాంటీ సబ్‌మెరైన్ నౌక సముద్ర రక్షణ వ్యవస్థలో కీలకపాత్ర పోషించనుంది. ముఖ్యంగా తక్కువ లోతు ఉన్న తీర ప్రాంతాల సమీపంలో శత్రు సబ్‌మెరైన్‌లను గుర్తించి, వెంటనే వాటిని నిర్వీర్యం చేయటం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.

ఈ నౌకను తయారు చేసే ప్రక్రియలో దేశీయ ఇంజనీరింగ్ కంపెనీలు, నేవీ డిజైన్ బ్యూరో, పరిశోధనా సంస్థలు కలిసి పనిచేశారు. నౌకలో అమర్చిన అత్యాధునిక సోనార్ సెన్సార్లు శత్రు సబ్‌మెరైన్‌లను చాలా దూరం నుంచే గుర్తించగలవని అధికారులు వెల్లడించారు. సముద్రంలోని చిన్న మార్పులను కూడా గుర్తించే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. అలాగే, శత్రు జలాంతర్గాములను వెంటాడి ధ్వంసం చేయడానికి తీసుకొచ్చే టార్పెడోలు, రాకెట్ లాంచర్లు ఈ నౌకకు మరింత దృఢత్వాన్ని ఇస్తున్నాయి. దాడులు తిప్పికొట్టే సామర్థ్యంతో పాటు, గస్తీ, రక్షణ, ఇంటెలిజెన్స్ మిషన్లలో కూడా మాహె సమర్ధవంతంగా పనిచేయగలదని నిపుణులు చెబుతున్నారు.

భారత ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్న ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంలో మాహె ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని నౌకాదళ అధికారులు పేర్కొన్నారు. విదేశీ పరికరాలపై ఆధారపడకుండా స్వతంత్రంగా అత్యాధునిక రక్షణ సాధనాలను తయారు చేసే మార్గంలో ఇది భారీ పురోగతిగా వారు అభివర్ణించారు. స్వదేశీ నౌక నిర్మాణ రంగానికి మాహె మరింత అభివృద్ధికి దారితీస్తుందని, భవిష్యత్తులో ఇలాంటి అనేక ఆధునిక యుద్ధ నౌకలను భారత్ తయారు చేయగల సామర్థ్యాన్ని ఇది నిరూపించిందని నేవీ వర్గాలు విశేషంగా ప్రశంసించాయి. మాహె నౌక చేరికతో భారత నౌకాదళం తీర భద్రత, సముద్ర రక్షణ, యాంటీ సబ్‌మెరైన్ ఆపరేషన్లలో మరింత బలోపేతం కానుంది. దేశ రక్షణలో కొత్త శక్తిగా మాహె కీలకపాత్ర పోషించనుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఐఎన్‌ఎస్‌ మాహె ప్రత్యేకమిలా..

. ధ్వని తక్కువగా ఉండే ఈ వాటర్‌క్రాఫ్ట్‌ (INS Mahe) నీటిలో చాలా నిశ్శబ్దంగా కదులుతుంది. దీంతో శత్రు జలాంతర్గాములు దీని రాకను గుర్తించలేవు. అందుకే దీన్ని ‘సైలెంట్‌ హంటర్‌’గా పిలుస్తున్నారు.
. ఇందులోని సోనార్‌ సిస్టమ్‌ దీనికి అదనపు ఆకర్షణ. శత్రు జలాంతర్గాములు, మైన్స్‌, సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు కళ్లూ, చెవులుగా పనిచేస్తుంది.
. డీఆర్డీవో అభివృద్ధి చేసిన అభయ్‌ హల్‌-మౌంటెడ్‌ సోనార్‌ వ్యవస్థను ఇందులో ఏర్పాటుచేశారు. దీంతో నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం గమనించే వీలు ఉంటుంది. జలాంతర్గాముల శబ్ధాలు, వాటి కదలిలకను ఇది వేగంగా గుర్తిస్తుంది.
. ఇందులోని లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్‌ డెప్త్‌ సోనార్‌ వ్యవస్థ సాయంతో సముద్రంలో చాలా లోపలివరకు నిఘా వేసేందుకు వీలు లభిస్తుంది. ఈ నౌక నుంచి ఓ కేబుల్‌ విడిపోయి సముద్ర గర్భంలో శత్రు ముప్పును పసిగడుతుంది.
. ఈ నౌకలో ఐఆర్‌ఎల్‌ యాంటీ-సబ్‌మెరైన్‌ రాకెట్‌ లాంఛర్‌, 30 ఎంఎం నావెల్‌ సర్ఫేస్‌ గన్‌, అడ్వాన్స్‌డ్‌ ట్రిపుల్‌ లైట్‌వెయిట్‌ టార్పెడో లాంఛర్‌, యాంటీ-సబ్‌మెరైన్‌ మైన్స్‌, 12.7 ఎంఎం రిమోట్‌ కంట్రోల్‌ గన్‌ వంటి ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి.
. తక్కువ లోతు ఉండే ప్రాంతాల్లో ఇది చాలా సమర్థంగా పని చేయగలదు. ఈ యుద్ధ నౌక పొడవు 78 మీటర్లు. దీంతో ఇది సముద్ర జలాల్లో వేగంగా, స్థిరంగా కదలగలదు.
. ఈ నౌక గంటకు 25 నాటికల్‌ మైళ్ల వేగంతో వెళ్లగలదు. దీంతో వేగవంతంగా చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్లలో ఇది కీలకంగా పనిచేస్తుంది.
. ఈ నౌకలో 57 మంది సిబ్బంది పని చేస్తారు. వీరిలో ఏడుగురు అధికారులు, 50 మంది నావికులు ఉంటారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -