Lorry Owners Association : పాత వాహనాల (Old vehicles) ఫిట్‌నెస్ టెస్టింగ్ ఫీజు(Fitness testing fee) లను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పెంపును నిరసిస్తూ డిసెంబర్ 9 అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెను ప్రారంభిస్తున్నట్లు సంఘం ప్రకటించింది. ఈ సమ్మెతో 40 వేలకుపైగా సరుకు రవాణా లారీలు రోడ్లపైకి రాకపోవడంతో రవాణా రంగం పూర్తిగా స్థంభించే అవకాశం ఉంది. లారీ యజమానుల సంఘం తెలిపిన వివరాల ప్రకారం, 13 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయస్సు గల వాహనాలకు విధించిన భారీ ఫిట్‌నెస్, టెస్టింగ్ ఛార్జీలు చిన్న స్థాయి రవాణాదారులకు తీవ్రమైన ఆర్థిక భారం అవుతున్నాయి.
ఇప్పటికే డీజిల్ ధరలు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిన నేపధ్యంలో కొత్తగా విధించిన ఈ ఛార్జీలు చిన్న యజమానులను పూర్తిగా కుదేలు చేస్తాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కేంద్రం జారీ చేసిన తాజా నోటిఫికేషన్‌ను తక్షణమే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసే పూర్తి అధికారం ఉందని, అందువల్ల సీఎం వెంటనే జోక్యం చేసుకుని పాత ఫీజులనే అమలు చేయాలని లారీ యజమానుల సంఘం కోరుతోంది. సమ్మె కారణంగా రాష్ట్రంలోని రైల్వే గూడ్స్ షెడ్లు, పోర్టుల నుంచి సరకు రవాణా పూర్తిగా నిలిచిపోనుంది. నిత్యావసరాల సరఫరా కూడా అంతరాయం చెందే అవకాశం ఉందని సంఘం హెచ్చరిస్తోంది.
ఇక, మరోవైపు రవాణా వ్యవస్థ నిలిచిపోతే తీవ్రమైన ప్రభావాలు ఎదురుకావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశ ఆర్ధిక వ్యవస్థకు రవాణా రంగం కీలకమైనది కావడంతో సరకు రవాణా ఆగిపోతే ఆహార ధాన్యాలు, పాలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకుల సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రవాణా తగ్గితే మార్కెట్లో సరుకు కొరత పెరిగి ధరలు పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన స్పందించి లారీ యజమానులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని ప్రజలతో పాటు వాణిజ్య సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సమ్మె దీర్ఘకాలం కొనసాగితే రాష్ట్ర వ్యాపార, పారిశ్రామిక రంగాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున, అందరి దృష్టి ఇప్పుడు ప్రభుత్వాల చర్యలపై నిలిచింది.
