New Rules : దేశవ్యాప్తంగా ప్రజల జీవితంలో కీలకమైన మార్పులు రానున్నాయి. నవంబర్ 1 నుంచి బ్యాంకింగ్, ఆధార్ నమోదు (Banking, Aadhaar registration)విధానాల్లో కొత్త నియమాలు అమల్లోకి రాబోతున్నాయి. ఈ మార్పులు సాధారణ ప్రజల సౌకర్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీసుకున్న ముఖ్య నిర్ణయాలుగా భావించవచ్చు. ఇప్పటి వరకు ఆధార్‌లో పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ లేదా ఇతర వివరాలు మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్లకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చేది. అయితే ఈ అసౌకర్యాన్ని తగ్గించేందుకు యూఐడీఏఐ (UIDAI) కొత్త ఆన్‌లైన్ సర్వీసును ప్రారంభిస్తోంది. నవంబర్ 1 నుంచి ప్రజలు ఇంటి నుంచే తమ మొబైల్ ద్వారా ఆధార్ వివరాలను సులభంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సేవ కోసం రూ.75 రుసుము మాత్రమే చెల్లించాలి. మొబైల్ వేరిఫికేషన్ అనంతరం, అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేసి మార్పులు పూర్తి చేయవచ్చు. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు పెద్ద సౌకర్యంగా మారనుంది.
బ్యాంక్ ఖాతాలకు కొత్త నామినీ రూల్స్
ఇక బ్యాంకింగ్ రంగంలో కూడా ముఖ్యమైన మార్పు జరగబోతోంది. గతంలో ఒకే వ్యక్తిని నామినీగా నియమించే అవకాశం మాత్రమే ఉండేది. అయితే, ఆర్‌బీఐ తాజా మార్గదర్శకాల ప్రకారం, నవంబర్ 1 నుంచి ప్రతి ఖాతాదారుడు గరిష్టంగా నలుగురు నామినీలను తన అకౌంట్, లాకర్ లేదా సేఫ్ కస్టడీ సదుపాయాల కోసం నియమించుకోవచ్చు. ఈ మార్పు కుటుంబ సభ్యుల భద్రత దృష్ట్యా తీసుకున్నదని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. నామినీ వాటాలను శాతాల వారీగా నిర్ణయించే అవకాశమూ ఇవ్వనున్నారు.
థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చెల్లింపులపై ఫీజు
మరోవైపు, ఎస్‌బీఐ నవంబర్ 1 నుంచి కొత్త చార్జీల విధానాన్ని ప్రవేశపెడుతోంది. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా విద్యా ఫీజులు చెల్లించడంలో లేదా రూ.1000కుపైగా వాలెట్ రీచార్జ్ చేసేటప్పుడు, 1 శాతం సర్వీస్ ఫీజు వసూలు చేయనుంది. ఇది డిజిటల్ పేమెంట్లలో పారదర్శకతను పెంచేందుకు తీసుకున్న చర్యగా ఎస్‌బీఐ అధికారులు పేర్కొంటున్నారు. ఈ కొత్త నియమాలు డిజిటల్ ఇండియా లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడమే కాకుండా, ప్రజలకు సౌకర్యాన్ని పెంచే దిశగా సాగుతున్నాయి. అయితే, ఈ మార్పులపై ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. నవంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రతి ఒక్కరూ తమ ఆధార్, బ్యాంక్ వివరాలను సరిచూసుకోవడం మంచిది.
