end
=
Tuesday, November 25, 2025
వార్తలుజాతీయంవేడుకలకు కొత్త అవకాశాలు..నమో భారత్‌లో వినూత్న ఆఫర్!
- Advertisment -

వేడుకలకు కొత్త అవకాశాలు..నమో భారత్‌లో వినూత్న ఆఫర్!

- Advertisment -
- Advertisment -

Namo Bharat trains : ప్రజా రవాణా రంగంలో కొత్త ఆలోచనలను ముందుకు తెచ్చే ప్రయత్నంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ) మరో అడుగు వేసింది. ఢిల్లీ, మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్టీఎస్‌ఎస్) పరిధిలో నడుస్తున్న నమో భారత్ రైళ్లను(Namo Bharat trains) ఇప్పుడు వ్యక్తిగత వేడుకలు, ప్రత్యేక ఫొటోషూట్‌(Special photoshoot)ల కోసం కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఏ రీజినల్ ర్యాపిడ్ రైల్ సర్వీసులోనూ ఇలాంటి సేవలు ఇదే మొదటిసారి అందుబాటులోకి రావడం విశేషం. ఎన్‌సీఆర్‌టీసీ తెలిపిన వివరాల ప్రకారం, పుట్టినరోజులు (Birthdays), చిన్నపాటి వేడుకలు, ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్‌లు, గెట్-టుగెదర్‌లు వంటి వ్యక్తిగత కార్యక్రమాలను రైలు కోచ్‌లలో నిర్వహించే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తోంది.

ఇందుకోసం రెండు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. దుహాయ్ డిపోలో ఏర్పాటు చేసిన స్టాటిక్ మాకప్ కోచ్‌ను అద్దెకు తీసుకోవచ్చు లేదా అందుబాటు ఆధారంగా ప్రస్తుతం నడుస్తున్న రైలు కోచ్‌ను బుక్ చేసుకోవచ్చు. దుహాయ్ డిపోలోని మాకప్ కోచ్ ప్రత్యేక ఆకర్షణ. ఇది అసలు నమో భారత్ రైళ్ల తరహాలోనే ఆధునిక ఇంటీరియర్ డిజైన్, లైటింగ్, రంగురంగుల అలంకరణలు, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి అంశాలతో అందుబాటులో ఉంటుంది. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, చిన్న బడ్జెట్ ప్రాజెక్టుల షూటింగ్‌లకు ఇది ఎంతో అనుకూలమని అధికారులు పేర్కొన్నారు. మాకప్ కోచ్ బుకింగ్ ఛార్జ్ గంటకు ₹5,000గా నిర్ణయించారు. ఈ చార్జ్‌లో అరగంట అలంకరణ ఏర్పాట్ల కోసం, మరొక అరగంట క్లీనప్ లేదా సర్దుబాట్ల కోసం కేటాయించబడింది. అంతేకాక, ఫీచర్ ఫిల్మ్‌లు, యాడ్ షూట్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీల కోసం కూడా రైళ్లు మరియు స్టేషన్లను అద్దెకు ఇచ్చేందుకు ప్రత్యేక పాలసీని రూపొందించినట్టు ఎన్‌సీఆర్‌టీసీ వెల్లడించింది.

ఈవెంట్ నిర్వహణకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. సాధారణ ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యకలాపాలు సాగుతాయని కార్పొరేషన్ స్పష్టం చేసింది. అలంకరణకు అనుమతి ఉన్నప్పటికీ భద్రత, అగ్ని ప్రమాద నియంత్రణ వంటి అన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఈ కార్యక్రమాలన్నీ ఎన్‌సీఆర్‌టీసీ సిబ్బంది మరియు భద్రతా బృందం పర్యవేక్షణలో నిర్వహించబడతాయి. ఆనంద్ విహార్, ఘజియాబాద్, మీరట్ సౌత్ వంటి కీలక ప్రాంతాల్లో స్టేషన్లు ఉండటం, అలాగే వేడుకలకు ఫోటోజనిక్ సెటప్ ఉండటం వల్ల ఈ కొత్త సేవ స్థానిక యువత, ఫోటోగ్రాఫర్లు, కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎక్కువగా ఆకర్షిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తొలిసారి దశలోనే వచ్చిన స్పందనను పరిశీలించి, భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక సేవలను ప్రవేశపెట్టే అవకాశాన్ని కూడా ఎన్‌సీఆర్‌టీసీ పరిశీలిస్తోంది.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -