Gold prices: గత రెండు నెలలుగా ఎగబాకుతూ వచ్చిన బంగారం, వెండి ధరల (Gold and silver prices)కు బ్రేకులు పడాయి. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో పాటు డాలర్ బలపడటం వల్ల పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ కమోడిటీస్ విభాగం ఉపాధ్యక్షుడు రాహుల్ కలాంత్రీ మాట్లాడుతూ, “డాలర్ ఇండెక్స్ బలపడటం, అమెరికా-చైనా, ఇండియా వాణిజ్య చర్చల్లో సానుకూల పురోగతి కనిపించడం వంటి అంశాలు బంగారం ధరలపై ఒత్తిడిని సృష్టించాయి. అదనంగా, గాజాలో శాంతి చర్చలు ఆశాజనకంగా సాగుతుండటంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల నుంచి బయటకు వస్తున్నారు. అందువల్ల ధరలు తగ్గాయి” అని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు తగ్గినప్పుడు, డాలర్ బలపడినప్పుడు సాధారణంగా పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి రక్షిత ఆస్తులపై ఆసక్తి తగ్గిస్తారని ఆయన తెలిపారు. అయితే, ఈ తగ్గుదల తాత్కాలికమై ఉండే అవకాశం ఉందని సూచించారు. ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో ధరలు పడినప్పుడల్లా కొనుగోళ్లకు ఆసక్తి పెరుగుతోందని కలాంత్రీ విశ్లేషించారు. ఈ వారం జరగబోయే ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. అమెరికా ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు కోతను ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ప్రస్తుత విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది. టెక్నికల్ విశ్లేషణ ప్రకారం, బంగారానికి రూ. 1,22,470 – 1,21,780 వద్ద మద్దతు, రూ. 1,23,950 – 1,24,800 వద్ద నిరోధం ఏర్పడే అవకాశం ఉందని కలాంత్రీ పేర్కొన్నారు. వెండి ధరలు రూ. 1,46,250 – 1,45,150 వద్ద మద్దతు, రూ. 1,47,950 – 1,48,780 వద్ద నిరోధం ఎదుర్కొనవచ్చని చెప్పారు.
ఆస్పెక్ట్ బులియన్ అండ్ రిఫైనరీ సీఈవో దర్శన్ దేశాయ్ మాట్లాడుతూ..సురక్షిత పెట్టుబడిగా బంగారం ఆకర్షణ తగ్గడం ధరల పతనానికి ప్రధాన కారణం. అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో సానుకూల సంకేతాలు, బలమైన డాలర్ పసిడిపై ఒత్తిడిని పెంచుతున్నాయి అని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య జరగనున్న భేటీ, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, ప్రధాన టెక్ కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయని ఆయన అంచనా వేశారు. ఫెడ్ అంచనాలకన్నా తక్కువ వడ్డీ కోత ప్రకటిస్తే బంగారం మరింత పడిపోవచ్చని, అదే సమయంలో కొత్త ఉద్రిక్తతలు లేదా సానుకూల వ్యాఖ్యలు వస్తే పసిడి తిరిగి పుంజుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
