Canada: కెనడా ప్రభుత్వం కీలక (Canada Government)నిర్ణయం తీసుకుంది. విదేశీ వ్యాపారవేత్తలను ఆకర్షించేందుకు అమలు చేస్తున్న స్టార్ట్-అప్ వీసా (SUV) ప్రోగ్రామ్‌కు సంబంధించిన వర్క్ పర్మిట్ దరఖాస్తులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) అధికారుల ప్రకారం, దేశంలోని వ్యాపార ఇమిగ్రేషన్ విధానాలను సమగ్రంగా పునర్నిర్మించడంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నారు. ఇకపై స్టార్ట్-అప్ వీసా ప్రోగ్రామ్ కింద కొత్తగా వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే ఈ ప్రోగ్రామ్ ద్వారా వర్క్ పర్మిట్ పొందిన వారు వాటిని పొడిగించుకునేందుకు దరఖాస్తు చేస్తే, వారికి ఈ నిబంధన వర్తించదని తెలిపారు.
స్టార్ట్-అప్ వీసా ప్రోగ్రామ్‌ను నిలిపివేయడం వెనుక ప్రధాన ఉద్దేశం కెనడా దీర్ఘకాలిక ఇమిగ్రేషన్ లక్ష్యాలకు మరింత అనుగుణంగా వ్యవస్థను రూపొందించడమేనని ఐఆర్‌సీసీ వెల్లడించింది. విదేశీయులు కెనడాలో కొత్త వ్యాపారాలు ప్రారంభించి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా మరింత సమర్థవంతమైన విధానం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ప్రస్తుత వ్యాపార ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్‌లను పునఃసమీక్షించి, అవసరమైన మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా స్టార్ట్-అప్ వీసా వర్క్ పర్మిట్ దరఖాస్తులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా తీసుకురాబోయే స్కీమ్‌లో విదేశీ వ్యాపారవేత్తలకు మరిన్ని సౌకర్యాలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
కెనడా ప్రభుత్వం స్టార్ట్-అప్ వీసా స్థానంలో సరికొత్త వ్యాపార ఇమిగ్రేషన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. దీనిని 2026లో పైలట్ ప్రాజెక్ట్ రూపంలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఐఆర్‌సీసీ అధికారులు తెలిపారు. అయితే ఈ కొత్త ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? స్టార్ట్-అప్ వీసాతో పోలిస్తే ఇందులో ఎలాంటి మార్పులు ఉంటాయి? అనే అంశాలపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. రెండు ప్రోగ్రామ్‌ల మధ్య తేడాల గురించి కూడా అధికారికంగా వివరించలేదు. 2026లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని మాత్రమే చెప్పారు. ఈ నిర్ణయంతో కెనడాలో వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న విదేశీయులు కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
