Air pollution : ఢిల్లీ(Delhi)తో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) ప్రాంతాల్లో వాయు కాలుష్యం(Air pollution) తీవ్ర స్థాయికి చేరి ప్రజల ప్రాణాలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫయర్ల(Air purifiers)పై కేంద్ర ప్రభుత్వం(Central Govt) విధిస్తున్న 18 శాతం జీఎస్టీపై ఢిల్లీ హైకోర్టు గట్టిగా స్పందించింది. అత్యవసర పరిస్థితుల్లోనైనా వేగంగా నిర్ణయాలు తీసుకోలేరా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని వ్యాఖ్యానించిన ధర్మాసనం, కనీసం ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీ తగ్గించే విషయంలోనైనా సానుకూలంగా ఆలోచించలేరా అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, రెండ్రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వాయు కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతూ, మరణాలు సంభవిస్తున్న వేళ, ఈ పరికరాలను విలాస వస్తువుల్లా పరిగణించడం ఎంతవరకు సమంజసం అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎయిర్ ప్యూరిఫయర్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరుతూ అడ్వకేట్ కపిల్ మదన్ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిల్‌పై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గేదెలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా కేంద్రం తరఫు న్యాయవాది స్పందించేందుకు 15 రోజుల సమయం కావాలని కోరగా, ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఢిల్లీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకు తెలియదా? ఇది అత్యవసర పరిస్థితి. ఇలాంటి వేళల్లో వేగంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదా? అంత సమయం ఎందుకు కావాలి? ఎంతమంది ప్రాణాలు పోయాక చర్యలు తీసుకుంటారు?” అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. కనీసం తాత్కాలికంగా అయినా జీఎస్టీ మినహాయింపులు లేదా తగ్గింపు ఇవ్వలేరా అని అడిగిన న్యాయస్థానం, జీఎస్టీ కౌన్సిల్ ఏం చేస్తోందని నిలదీసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశమై, ఎయిర్ ప్యూరిఫయర్లపై పన్ను తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటిలోగా కేంద్రం స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని హైకోర్టు ఆదేశించింది.
