CM Revanth Reddy : హైదరాబాద్(Hyderabad) నగరంలోని గోషామహల్ స్టేడియం(Goshamahal Stadium)లో పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవాన్ని(Police Martyrs’ Memorial Day) ఘనంగా నిర్వహించారు. పోలీసు శాఖకు సేవలందించిన అమరవీరుల త్యాగాలకు గుర్తుగా జరిగిన ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించి, పుష్పాంజలులర్పించారు. ఈ సందర్భంలో సీఎం మాట్లాడుతూ..పోలీసులు అంటే ప్రజలకు నమ్మకం, భరోసా అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలనే పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసుల ధైర్యాన్ని కొనియాడారు. ఒక వ్యక్తిగా కాక, ఒక ప్రభుత్వంగా పోలీసు కుటుంబాలకు మా పూర్తి మద్దతు ఉంటుంది. అమరవీరుల కుటుంబాలకు విద్య, ఆర్థిక సహాయం అందిస్తాం అని హామీ ఇచ్చారు.
తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం వివరించారు. విభిన్న విభాగాల్లో మన పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారు. ప్రజల రక్షణ కోసం 24 గంటలూ అప్రమత్తంగా ఉంటున్నారు అని చెప్పారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా, డిజిటల్ మోసాల వంటి ఆధునిక నేరాలకు ఎదురుగానే తెలంగాణ ప్రభుత్వం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. టెక్నాలజీతో వచ్చే ముప్పులను టెక్నాలజీతోనే ఎదుర్కొంటున్నాం. సైబర్ నేరాల నియంత్రణలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి, నేరాల మీద నిఘా పెంచాం అని తెలిపారు.
ఇటీవల మావోయిస్టులందరిలో కొన్ని వర్గాలు పోలీసులకు లొంగిపోయిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. మిగిలిన మావోయిస్టులను కూడా హింసను వదిలి సామాన్యుల జీవితంలో కలిసిపోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి. అభివృద్ధి మార్గాన్ని అంగీకరించాలి అని సూచించారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా పని చేయండి. పోలీస్ వ్యవస్థ స్వతంత్రంగా, సమర్థంగా పనిచేయాలి అని సూచించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000 మంది కానిస్టేబుల్‌లు, ఎస్ఐల్ని భర్తీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
పోలీసు ఉద్యోగం అనేది కత్తి మీద సాము లాంటిది. ప్రజల క్షేమం కోసం రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తున్నారు. వారి త్యాగాలు ప్రశంసనీయం అని అన్నారు. దేశంలోనే అత్యధికంగా పరిహారం ఇస్తున్న ప్రభుత్వం తమదే అని పేర్కొన్నారు. ఈ స్మారక దినోత్సవం రాష్ట్ర పోలీసు విభాగం సేవలను గుర్తు చేసుకునే, వారికి సంఘీభావం ప్రకటించే వేదికగా నిలిచింది. పోలీసులు చేస్తున్న త్యాగాలు అమూల్యమైనవని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సీఎం పునరుద్ఘాటించారు.
