Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) సీరియల్ స్నాచర్‌లా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఉర్దూ యూనివర్సిటీ భూములకు(Urdu University lands) సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో నందినగర్‌లో విద్యార్థులతో కేటీఆర్ సమావేశమయ్యారు. విద్యార్థుల ఆందోళనలు, వారి భవిష్యత్తుపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వానికి భూములు లాక్కోవడం కొత్త కాదని, ఇది ఒక అలవాటుగా మారిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గతంలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు.
ఆ సమయంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పటికీ, వారి స్వరాన్ని అణిచివేశారని ఆరోపించారు. విద్యార్థుల ఆందోళనలను పట్టించుకోకుండా పోలీసు బలగాలతో ఉద్యమాన్ని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలోనూ ఇదే తరహా భూ దందా జరిగిందని కేటీఆర్ తెలిపారు. అక్కడ సుమారు 400 ఎకరాల భూమిని లాక్కోవడానికి అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నించాయని చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వాలు చెవికెక్కించలేదని విమర్శించారు. చివరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా ఈ అంశాన్ని స్వీకరించి ఆదేశాలు జారీ చేసే వరకు ప్రభుత్వాలు స్పందించలేదని గుర్తు చేశారు.
ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములపై కూడా అదే విధమైన కుట్ర జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. విద్యా సంస్థల భూములు విద్యార్థుల భవిష్యత్తుకు చెందినవని, వాటిని వ్యాపార ప్రయోజనాల కోసం లాక్కోవడం అన్యాయమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో విద్యా సంస్థలను బలిపశువులుగా మారుస్తోందని అన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిపైనే దాడి చేస్తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ విద్యార్థుల పక్షాన నిలబడుతుందని, ఉర్దూ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు అన్ని విధాలా పోరాటం చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. విద్యా సంస్థల పరిరక్షణ కోసం విద్యార్థులు, ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
