Congress : కర్ణాటక(Karnataka) కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి(Chief Minister post) మార్పిడి వివాదం మరోసారి తీవ్రతరమైంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(CM Siddaramaiah, Deputy CM DK Shivakumar) మధ్య నెలలుగా నడుస్తున్న అంతర్గత ఉద్రిక్తత ఇప్పుడు సోషల్ మీడియాలో తెరమీదకెక్కింది. ఇద్దరు నేతలు పరోక్ష వ్యాఖ్యలతో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడంతో వివాదం చుట్టూ రాజకీయ వేడి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ పరిస్థితిని శాంతింపజేయడానికి జోక్యం చేసుకుంది. డీకే శివకుమార్ ఎక్స్‌లో చేసిన ఒక పోస్టు ఈ చర్చలకు నాంది పలికింది. మాటకున్న విలువే అసలు శక్తి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం గొప్పతనం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రస్తుత రెండున్నరేళ్ల అధికార మార్పిడి ఒప్పందంను సూచిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది.
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం పదవి మార్పిడి విషయమై ఒక అవగాహన కుదిరిందని అప్పటినుంచే వార్తలు వినిపిస్తున్నాయి. డీకే వ్యాఖ్యలకు సీఎం సిద్ధరామయ్య కూడా ఘాటుగానే ప్రతిస్పందించారు. ప్రజలకు మేలు చేయడంలో మాటలకన్నా పనికి ఎక్కువ విలువ ఉంటుంది అని స్పష్టం చేస్తూ, తమ ప్రభుత్వం అమలు చేసిన ‘శక్తి’ యోజన ద్వారా మహిళలకు 600 కోట్ల రూపాయలకు పైగా ఉచిత ప్రయాణాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు తమకు పూర్తి అయిదేళ్ల పాలన బాధ్యత అప్పగించారని, ఆ బాధ్యతే తమ మాట అని పేర్కొన్నారు. ఇద్దరు ప్రధాన నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుండటాన్ని కర్ణాటక బీజేపీ వ్యంగ్యంగా విమర్శించింది. ఇది ‘శక్తి’ గురించి కాదు, ‘కుర్చీ’ కోసం జరుగుతున్న పోరాటమని ఎద్దేవా చేసింది. అంతేకాకుండా, సిద్ధరామయ్యను ట్యాగ్ చేస్తూ డీకే శివకుమార్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని సూచిస్తూ వ్యాఖ్యలు వేసింది.
నవంబర్ 20తో సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనను పూర్తి చేసుకోవడంతో ఈ వివాదం మళ్లీ ఉత్పన్నమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్రిక్త పరిస్థితిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఇద్దరు నేతలను త్వరలోే నూతన ఢిల్లీకి పిలిచి చర్చిస్తామని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశం తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇక, రాష్ట్రంలోని సామాజిక వర్గాలు కూడా ఈ వివాదంపై తమ స్వరాన్ని వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్యను తప్పిస్తే వెనుకబడిన వర్గాలు మౌనంగా ఉండబోవని సమాఖ్యలు హెచ్చరికలు జారీ చేయగా, డీకే శివకుమార్‌కు అన్యాయం జరిగితే సహించబోమని ఒక్కలిగ సంఘం సమాధానం ఇచ్చింది. దీంతో ముఖ్యమంత్రి పదవి మార్పిడి అంశం కర్ణాటక రాజకీయాల్లో మరింత క్లిష్ట దశకు చేరుకుంది.
